పార్టీ ఒకటే అయినా.. నేతల మధ్య పవర్ గేమ్ కొన్నిసార్లు పార్టీకి చికాకుగా మారుస్తూ ఉంటుంది. అందునా అధికారంలో ఉన్న పార్టీకి ఈ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఏపీ అధికారపక్షం వైసీపీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ.. పార్టీకి చెందిన ఎంపీపై ఘాటు విమర్శలు చేశారు. వీరిద్దరి మధ్యన లొల్లి ఉందన్న విషయం తెలిసిందే.
పార్టీకి నష్టం కలిగించిన వారిని.. కేసులు ఉన్న వారిని దూరం పెడితే వారిని పార్టీలోకి తీసుకొచ్చి అలజడి క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన నేత ఒకరు టీడీపీ నేతలతో కుమ్మక్కై తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి కారణంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న ఆవేదన వ్యక్తం చేసిన జక్కంపూడి.. ఉదాహరణలతో సహ రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ ను ఉద్దేశించి ఆరోపణలు సంధించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు.. నిరసనలు.. ధర్నాలు చేసిన సీతానగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేస్తే.. అతడికి వత్తాసు పలకటం సరైన పద్ధతి కాదన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కొందరు రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాల్ని తెరిపించి.. పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
పవర్ చేతిలో ఉన్నప్పుడు డెవలప్ మెంట్ చేయని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150 కోట్లతో డెవలప్ మెంట్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. సొంత పార్టీ ఎంపీ తీరుపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే లొల్లిని తేల్చాల్సిన అవసరం పార్టీకి ఉందంటున్నారు. ఇలాంటివి నానబెట్టటం వల్ల సమస్యలే తప్పించి.. సొల్యూషన్ రాదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.