తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర సంకటంగా మారిన ప్రధాన అంశం.. వినాయక చవితి ఉత్సవాలు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం! ఇటీవల కాలంలో కరోనా తీవ్రత ప్రబలిన నేపథ్యంలో బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే విషయంపై వైద్యులు.. నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణ హైకోర్టులో ఈ విషయంపై ప్రధానంగా కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన.. ధర్మాసనం.. తక్కువ మందితో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కకేసీఆర్ ప్రభుత్వం ఒడ్డున పడింది.
ఇక, ఇంతలోనే.. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత.. నిమజ్జన ఘట్టంపై.. పర్యావరణ ప్రేమికులు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. హుసేన్ సాగర్.. కలుషితం అవుతోందని,, నిమజ్జనాలపై నిషేధం విధించాలని కోరారు. దీంతో హైకోర్టు ఈ దఫా ప్రబుత్వ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. భక్తుల మనోభావాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పర్యావరణం ముఖ్యం కాదా? అంటే.. మంత్రిని సోషల్ మీడియాలో ఏకేశారు.
ఇక, హైకోర్టు నిమజ్జనాల విషయంలో ఆంక్షలు విధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇస్తూనే.. కొన్ని ఆంక్షలు విధించింది. ప్రభుత్వానినికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు ఇవీ..
- హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు చేసుకోవచ్చు
- అయితే.. ఈ ఒక్క ఏడాదికి మాత్రమే అనుమతి
- వచ్చే ఏడాది నుంచి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి
- నిమజ్జనం జరిగిన వెంటనే విగ్రహాలను తొలగించేయాలి
- పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి
- నిమజ్జనానికి వినియోగించే క్రేన్లు.. అధునాతనమైనవే ఉండాలి
- నిమజ్జనానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ పూర్తిగా హైకోర్టుకు తెలియజేయాలి
- పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి
- జనాలు గుంపులుగా లేకుండా నిలువరించాలి
- కరోనా కట్టడి ముఖ్యం
- నిమజ్జనంలో దాదాపు హడావుడి లేకుండా చూడాలి.