జ‌గ‌న్‌కు బిగ్ రిలీఫ్‌.. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ కొట్టివేత‌

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టులో బిగ్ రిలీఫ్ వ‌చ్చింది. ఆయ‌న బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరు తూ.. వైసీపీ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సీబీఐ ప్ర‌త్యేక కోర్టు.. తాజాగా కొట్టివే సింది. అదేస‌మ‌యంలో పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ.. విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న‌.. ఆర్ ఆర్ ఆర్ పిటిష‌న్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. దీంతో అటు సీఎం జ‌గ‌న్‌కు, ఇటు సాయిరెడ్డికి బిగ్ రిలీఫ్ రాగా.. ఆర్ ఆర్ ఆర్ దూకుడుకు షాక్ త‌గిలింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏం జ‌రిగిందంటే..

అక్ర‌మాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ దాదాపు 11 సంవ‌త్స‌రాల కింద‌ట న‌మోదు చేసిన కేసుల్లో.. వైసీపీ అధినేత జ‌గ‌న్ కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బెయిల్ పొందారు. త‌ర్వాత ఏపీలో అధికారం లోకి కూడా వ‌చ్చారు. అయితే.. ఈ క్ర‌మంలో గ‌తంలో ఆయ‌న కేసుల్లో ఉన్న కొంద‌రు అధికారు ల‌కు ఏపీలో ప్రాధాన్యం పోస్టుల్లో నియ‌మించారు. దీనిని ప్ర‌శ్నిస్తూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృ ష్ణ‌రాజు.. బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. సీబీఐ ప్ర‌త్యేక కోర్టును ఆశ్ర‌యించారు. కొన్నాళ్ల కింద‌ట హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో ఉన్న సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో ర‌ఘురామ‌ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ప్ర‌స్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జ‌గ‌న్‌.. త‌న కేసుల‌కు సంబంధించి.. సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్ లో అభ్య‌ర్థించారు. దీనిపై జ‌రిగిన‌ విచార‌ణ‌లో సీబీఐ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాదులు.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై కోర్టు విచ‌క్ష‌ణ మేర‌కు నిర్ణ‌యం తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు. అయితే, ఆర్ ఆర్ ఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ కేవ‌లం రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని.. దీనిని ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. జ‌గ‌న్ త‌ర‌ఫున లాయ‌ర్లు కోర్టుకు వివ‌రించారు. దీంతో.. జ‌గ‌న్ బెయి ల్ ర‌ద్దుపై ఉత్కంఠ ఏర్ప‌డింది.

పైకోర్టుకు వెళ్తారా?

తాజాగా సీబీఐ కోర్టు ఈ పిటిష‌న్‌పై తీర్పును వెలువ‌రించింది. జ‌గ‌న్ స‌హా విజ‌య‌సాయిరెడ్డిపై దాఖ‌లైన‌ పిటిష‌న్ ల‌ను కొట్టి వేస్తూ.. న్యాయ‌మూర్తి తీర్పు వెలువ‌రించారు. అయితే.. ఈ తీర్పుపై ఆర్ ఆర్ ఆర్ పైకోర్టుకు వెళ్లే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. గ‌తంలోనే ఆయ‌న ఈ విష‌యాన్ని వెలువ‌రించారు. సీబీఐ కోర్టులో త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే.. అంటే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కాక‌పోతే.. తాను ఈ విష‌యాన్ని హైకోర్టు, సుప్రీం కోర్టు వ‌ర‌కు కూడా తీసుకువెళ్తాన‌ని.. మీడియాకు చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి.. తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై ర‌ఘురామ‌.. హైకోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.