మోడీ ఆశలు వదిలేసుకున్నారా ?

ఇంతకాలం కేవలం ఏపీ విషయంలోనే నరేంద్రమోడి ఆశలు వదిలేసుకున్నదని అనుకుంటున్నారు అందరూ. కానీ తాజాగా తెలంగాణా విషయంలో కూడా బీజేపీకి పెద్దగా బతుకు లేదని కేంద్రంలోని పెద్దలకు అర్ధమైపోయినట్లుంది. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు గట్టి ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణాకు యూపీఏ కేటాయించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం వెనక్కి వెళ్ళిపోయింది.

ఫ్యాక్టరీ ఏర్పాటును ఉపసంహరించుకున్నట్లు పైకి ప్రకటించలేదు కానీ చేతల్లో జరుగుతున్నది మాత్రం అదే. తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరి పనులు మహారాష్ట్రలోని లాతూర్లో చాలా స్పీడుగా జరుగుతున్నాయి. తెలంగాణా కోసం అప్పట్లో కేంద్రం మంజూరు చేసిన రు. 625 కోట్లను కూడా మోడి సర్కార్ నిలిపేసింది. పైగా అవే నిధులను లాతూర్ కు తరలించటమే కాంకుండా అందులో ఇప్పటికే సుమారు 587 కోట్లను ఖర్చు కూడా చేసేసింది. అంటే పనులు ఎంత స్పీడుగా జరుగుతోందో అర్ధమైపోతోంది.

మరిప్పుడు దీనిపై తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏమంటారో చూడాలి. 24 గంటలూ కేసీయార్ ను కార్నర్ చేయటానికి మాత్రమే ఉత్సాహం చూపిస్తున్న బండి అండ్ కో కేంద్రం వైఖరిపై ఏమి మాట్లాడుతారు ? రాబోయే ఎన్నికల్లో తమదే అధికారమంటూ బండి నానా గోల చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

ఇప్పటికే ఏపీ ప్రయోజనాల విషయంలో మోడీ సర్కార్ పెద్ద దెబ్బే కొట్టింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నూరు శాతం అమలు చేయలేదు. పైగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటుపరం చేసేస్తున్నారు. పోలవరం పథకం అంచనా వ్యయంలో కోత విధించేశారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో ఏపీని అంతా ఇబ్బంది పెడుతున్నారు.

ఏపీలో అంటే బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలిపోవటం తోనే మోదీ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని అందరికీ అర్ధమైపోయింది. మరి తెలంగాణా విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తోందంటే అర్థమేంటి ? తెలంగాణలో కూడా పార్టీకి బతుకు లేదని తీర్మానించేసుకున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఏదో గాలివాటుగా నాలుగు ఎంపీ సీట్లు వచ్చేశాయి. రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఆ సీట్లు వస్తాయనే గ్యారెంటీ లేదు. అందుకనే మంజూరైన ప్రాజెక్టులను కూడా తరలించేస్తున్నట్లుంది. మొత్తానికి క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే తెలుగు రాష్ట్రాలపై మోడి ఆశ వదిలేసుకున్నట్లే ఉంది.