ఏపికి ప్రత్యేక హోదా ఆశలపై బండ పడిందా ?

ఇప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు దాదాపు లేవని అర్ధమైపోతోంది. భవిష్యత్తులో రాజకీయ పరిణామాల కారణంగా ఏపీ కీలక పాత్ర పోషించే అవకాశం వస్తే అప్పుడు కానీ మనకు ప్రత్యేకహోదా రాదని జనాలు కూడా ఫిక్సయిపోయారు. అంటే విభజన చట్టం ద్వారా కచ్చితంగా అమలవ్వాల్సిన ప్రత్యేక హోదా కాస్త రాజకీయ డిమాండ్ గా మారిపోయింది. పైగా నరేంద్ర మోడీ ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని కూడా అందరూ అనుకుంటున్నదే.

ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన తాజా సిఫార్సుతో ఏపీ ఆశలపై పెద్ద బండి పడినట్లు అనిపిస్తోంది. వీళ్ళ సిఫార్సుతో ఇక ఏపీకి ఎప్పటికీ ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న సిఫారసుకు అదనంగా ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు కూడా పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని సంఘం సిఫారసు చేయటమే ప్రధాన కారణం. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విభజన చట్టాన్నే అమలు చేయని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో రెండు రాష్ట్రాలకు ఇస్తుందా ?

విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులోనే పెద్ద తప్పున్నట్లు అనిపిస్తోంది. అదేమిటంటే సమైక్య రాష్ట్రాన్ని విభజించినపుడు యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే అప్పట్లో జరిగిన అభివృద్ధి మొత్తం తెలంగాణా ప్రాంతంలోనే కేంద్రీకృతమైంది. పరిశ్రమలు లేక, ప్రభుత్వ రంగ సంస్థలు లేక, రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవతరించటం తోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు.

పైగా అప్పట్లో ప్రత్యేక తెలంగాణా కావాలన్న డిమాండ్ 10 జిల్లాలదయితే రాష్ట్రాన్ని విడగొట్టద్దన్న డిమాండ్లు సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో వినిపించాయి. మెజారిటీ ప్రజల మనోభవాలకు విరుద్ధంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించింది. ఇదే ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ రాష్ట్రాల పరిస్థితి వేరు. మధ్యప్రదేశ్ ను విడగొట్టి ఛత్తీస్ ఘర్, బీహార్ నుంచి విడగొట్టి ఝార్ఖండ్ ఏర్పాటు చేశారు. అక్కడ పరిస్థితి ఏమిటంటే మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విడగొట్టాలన్న డిమాండ్లకు విరుద్ధంగా వద్దని ఎవరు ఉద్యమాలు చేయలేదు.

ప్రత్యేక రాష్ట్రాలు కావాలని ఇప్పటి ఛత్తీస్ ఘర్ అయినా ఝార్ఖండ్ జనాలు డిమాండ్ చేస్తే ఇచ్చేయమని మిగిలిన ప్రాంతాల్లోని జనాలు కూడా చెప్పారు. కాబట్టే పెద్దగా ఉద్యమాలు జరక్కుండానే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందుకనే అప్పుడు పై రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రస్తావనే రాలేదు. పైగా ఇండస్ట్రియల్ గా డెవలప్ కావడానికి పై రెండు రాష్ట్రాల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలు, పరిశ్రమలు ఉన్నాయి.

ఇక రాజకీయ కోణంలో చూస్తే ప్రస్తుతం ఛత్తీస్ ఘర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలాగే ఝార్ఖండ్ లో హేమంత్ సోరేన్ అధికారంలో ఉన్నారు. అంటే రెండు రాష్ట్రాల్లోను బీజేపీ ప్రతిపక్షమే. అలాంటపుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటరీ సంఘం సిఫారసును నరేంద్రమోడి పట్టించుకుంటారా ? ప్రత్యేకహోదా విషయంలో పై రెండు రాష్ట్రాలతో ఏపీ కలపాల్సిన అవసరమే లేదు. అయినా కలిపారంటే ఏపికి ఇక ఏ రూపంలో కూడా ప్రత్యేకహోదా వచ్చే అవకాశమే లేదని అర్ధమైపోతోంది.