తెలుగుదేశంపార్టీలో జేసీ బ్రదర్స్ ఏమి మాట్లాడినా సంచలనమే. అసలు ఏమీ మాట్లాడకపోయినా సంచలనమే అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. రాయలసీమలోని నీటి ప్రాజెక్టుల స్ధితిగతులపై చర్చించేందుకు అనంతపురంలోకి కమ్మభవన్ లో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ ఓటమి ఖాయమన్నారు. పార్టీలోని కార్యకర్తల్లో నేతల్లో ఒక్కరిపైన కూడా నమ్మకం లేదంటు చేసిన ఘాటు వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఇప్పటికైనా చంద్రబాబునాయుడు మేల్కొక పోతే పార్టీకి భవిష్యత్తు కష్టమేనని సూటిగానే అధినేతకు విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల కోసం కష్టపడుతున్న నేత ఒక్కళ్ళు కూడా లేరన్నారు. గడచిన రెండున్నరేళ్ళల్లో కార్యకర్తలకు అండగా నిలిచిన నేతలు ఎంతమందున్నారని జేసీ వేసిన ప్రశ్నకు నేతల్లో ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు తక్షణమే పూనుకుని చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను, ఇన్చార్జీలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటం కష్టమేన్ననారు.
జిల్లా నేతలపైన కూడా ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లాలోని నేతలను అందరినీ కలుపుకుని వెళ్ళటం లేదన్నారు. డైరెక్టుగానే మాజీమంత్రి కాలువ శ్రీనివాసులపై మండిపోయారు. కాలువ పార్టీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఇపుడు పెట్టిన సమావేశానికి రమ్మని ఎంతమంది నేతలకు కాలువ ఆహ్వానాలు పంపారో చెప్పాలని నిలదీశారు. కొందరు నేతలకు అసలీ సమావేశం గురించిన సమాచారమే లేదన్నారు. కొందరు నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే పార్టీ ఏ విధంగా బలోపేతమవుతుందని ప్రశ్నించారు.
పార్టీ నిర్వహించాల్సింది కార్యకర్తల సమావేశాలు కానీ ప్రాజెక్టుల సమావేశాలు కాదన్నారు. ప్రాజెక్టులపై సమావేశాలు పెడితే కార్యకర్తలు ఎందుకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. రెండున్నరేళ్ళు కార్యకర్తలను పట్టించుకోని నేతలు ఇపుడు ప్రాజెక్టుల కోసం సమావేశాలకు రమ్మంటే కార్యకర్తలు ఎందుకు వస్తారన్నారు. ప్రాజెక్టల విషయంలో ప్రతిపక్షాలు సమావేశాల పెట్టాల్సిన అవసరమే లేదన్నారు. ముందు కార్యకర్తలను పట్టించుకుంటే పార్టీపై జనాల్లో నమ్మకం వస్తుందన్నారు.
పార్టీపై అభిమానం, చంద్రబాబును మళ్ళీ సీఎం కుర్చీలో చూడాలన్న కోరికతోనే తాను సమావేశానికి వచ్చానన్నారు. తనకు ఇంకా మాట్లాడాలని ఉన్నా బాగోదని మాట్లాడటం లేదంటు చెప్పి సమావేశం నుండి వెళిపోయారు. అంటే తాను చెప్పదలచుకున్నదంతా చెప్పేసి జేసీ మరీ సమావేశం నుండి వెళ్ళిపోవటంతో నేతలు స్టన్ అయిపోయారు. లోకేష్ ను అరెస్టు చేస్తే కూడా ఖండించలేని నేతలు ఈ పార్టీలో ఉన్నారంటూ వ్యంగ్యంగా అనేసి సమావేశం నుండి వెళిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates