ఔను! ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎనిమిది రోజులైంది.(గురువారమే ఆయన ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు) వాస్తవానికి ఆయన సెప్టెంబరు 1న ఢిల్లీకి వచ్చారు. తర్వాత 8 రోజులు ఢిల్లీలో నే ఉన్నారు. ఈ ఎనిమిది రోజుల్లో ఆయన హడావుడిగా పాల్గొన్న కార్యక్రమాలేవీ పెద్దగా కనిపించలేదు. ఢిల్లీకి చేరుకున్న రెండు రోజులు మాత్రమే హడావుడిగా ఆయన కనిపించారు. టీఆర్ఎస్ భవన్‌కు ఆయన శంకు స్థాపన చేయడంతోపాటు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుసుకున్నారు.
ఇంతవరకు మాత్రమే మీడియా కవరేజ్ ఇచ్చింది. తర్వాత.. ఆయన ఇన్ని రోజులు ఢిల్లీలో ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు? అనే విషయాలు మాత్రం గోప్యంగా ఉంచారు. దీంతో అసలు ఇన్ని రోజులు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారు? ఏయే వ్యూహాలకు పదును పెట్టారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. వాస్తవానికి కేసీఆర్ ఈ నెల 1న ఢిల్లీలో దిగినప్పుడు.. రేపో, మాపో తిరిగి రాష్ట్రానికి వెళతారని ఆ పార్టీ నేతలు అన్నారు. కానీ, ఆయన మాత్రం ఢిల్లీ నుంచి అంత త్వరగా కదిలేందుకు ఇష్టపడ లేదు. “నేను రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటాను.. మీరు వెళ్లిపోండి” అని చెప్పడంతో అనేక మంది అధికారులు తిరిగి వెళ్లిపోయారు.
వాస్తవానికి కేసీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు నుంచి రోజుకో కార్యక్రమానికి మాత్రమే పరిమితమయ్యారు. ఈ నెల 2న ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 3న ప్రధాని నరేంద్రమోడీని, 4న హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. 5న మాత్రం ఎవరినీ కలుసుకోలేదు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక అధికారిక ప్రకటన జారీ చేసి మిన్నకున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలుసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ..ఆయన అపాయింట్‌మెంట్ లభించలేదు.
ఇక ఈ నెల 6న కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి ని, జలశక్తి మంత్రిని కలుసుకున్నారు. 7న తెలంగాణ లో కురిసినవర్షాలు.. తద్వారా వెల్లువెత్తిన వరదల పరిస్థితి గురించి అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు. ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే కేసిఆర్ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నప్పటికీ.. అందులో రాజకీయ కోణం కూడా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ తనకు రాజకీయ ప్రత్యర్థి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా.. కేంద్రంలో తాను రాజకీయ ప్రత్యర్థి కాదనే సంకేతం పంపేందుకే ఆయన మోడీ, అమిత్ షాలను కలుసుకున్నట్లు అర్థమవుతోంది.
మరోవైపు జాతీయస్థాయిలో బీజేపీ బలహీన పడుతున్న రీత్యా కేసీఆర్ లాంటి తటస్థులను మోడీ వదులుకోబోరని, భావి అవసరాల రీత్యా స్నేహ హస్తమే చాస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే.. ఇన్ని రోజులు ఉండి.. బీజేపీతో చర్చించే అంశాలు పెద్దగా కేసీఆర్‌కు ఏమీ లేవు. అయితే.. ఢిల్లీలో ఎనిమిది రోజులు ఉండడం వెనుక.. తృతీయ కూటమి విషయంపై ఆయన మంతనాలు ఏమైనా చేశారా? పైకి కేసీఆర్ పేరు రాకపోయినా.. ఓం ప్రకాశ్ చౌతాలా వంటివారు తృతీయ కూటమి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా వ్యూహాలు రచించారా? ఈ క్రమంలోనే ఆయన అక్కడ ఉండిపోయారా? అనేది ఒక ప్రశ్న.
ఇవన్నీ ఇలా ఉంటే.. కేంద్రంలో ఏపీ ప్రభుత్వానికి ఉన్న పలుకుబడి.. ఏయే నేతలతో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందన్న విషయాలను తెలుసుకున్నారని.. ముఖ్యంగా జల జగడం విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరును కేంద్రంలోని కొందరు అధికారుల నుంచి సమాచారం స్వయంగా సేకరించారనే వాదన కూడా ఉంది. అయితే.. ఇవన్నీ చేయడానికి ఇంటిలిజెన్స్ అధికారులు ఎలానూ ఉన్నారు. అయినప్పటికీ.. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, టీఆర్ఎస్ భవన్‌కు సంబంధించిన ప్లాన్‌ను కూడా దగ్గరుండి పర్యవేక్షించేందుకు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారనే వాదన కూడా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. కేసీఆర్ ఎనిమిది రోజుల ఢిల్లీ పర్యటన చాలా సంచలనాలకు వేదికగా మారుతుండడం గమనార్హం.