తాజాగా ఏర్పాటైన ఆఫ్ఘనిస్ధాన్ మంత్రివర్గాన్ని చూసి యావత్ ప్రపంచం భయపడిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే మంత్రులుగా నియమితులైన 33 మందిలో 14 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. వివిధ దేశాల్లో అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడి, వందలాది మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిలో 14 మంది ఇప్పుడు ఆప్ఘన్ మంత్రివర్గంలో మంత్రులు గా చలామణి అవబోతున్నారు. అంటే ఆప్ఘన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఏ దేశమైనా గుర్తేస్తే అలా గుర్తించిన దేశాల దౌత్య రాయబారులు, విదేశాంగ మంత్రులు మంత్రుల ముసుగులో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులతోనే చర్చలు జరపాల్సుంటుంది.
ఈ 14 మంది ఆషామాషీ ఉగ్రవాదులు కాదు. వివిధ సందర్భాల్లో వేర్వేరు దేశాలను గడగడలాండిచిన వారే అని ఐక్యరాజ్యసమితే నెత్తీ నోరు మొత్తుకుంటోంది. మామూలుగా అయితే మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో ఎక్కడా కనబడరు. ఎక్కడో దాక్కుని తమ ఉగ్రవాద కార్యకలాల్లో పాల్గొంటుంటారు. బటయ ప్రపంచంలో కనబడితే ఏ దేశం తమను వెంటనే పట్టుకుని కాల్చి చంపేస్తుందో లేకపోతే విచారణ పేరుతో ఉరికంభం ఎక్కిస్తుందో అనే భయం ఉండేది. కానీ ఇపుడు వీరికి ఎలాంటి భయం అవసరం లేదు.
హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సిరాజుద్దీన్ హక్కానీ తలపై కోటి డాలర్లు అంటే సుమారు రు. 73 కోట్ల బహుమతి ఉంది. అంటే హక్కానీని పట్టించినా లేకపోతే ఆచూకీ తెలిపినా రూ. 73 కోట్ల బహుమానం ప్రకటించారు. కానీ ఇపుడు మంత్రి హోదాలో హక్కానీ దర్జాగా ప్రపంచం ముందు నిలబడినా ఏ దేశమూ ఏమీ చేయలేదు. ఇలాంటి వారు చాలామంది ఇపుడు ఆఫ్ఘన్ మంత్రివర్గంలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదుల జాబితాలోని 14 సంస్ధలకు చెందిన ఉగ్రవాదులు ఇఫుడు మంత్రులైపోయారు.
మంత్రివర్గంలో తాలిబన్ల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఐదుగురు మొహమ్మద్ నబీ ఒమర్, ముల్లా మహమ్మద్ ఫాజిల్, ఖైరుల్లా ఖైర్ ఖ్వా, ముల్లా నూరుల్లా సూరీ, ముల్లా అబ్దుల్ హక్ వాసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులే. ఈ ఐదుగురు అమెరికాలోని గ్వాంటనామో జైలులో శిక్షలు అనుభవించినవారే. అమెరికా జైలులో ఉన్న ఈ ఐదుగురు ఉగ్రవాదుల విడుదల కోసం తాలిబన్లు అమెరికా సైనికుడిని పట్టుకున్నారు. సైనికిడిని విడుదల చేయటం కోసం అమెరికా ఐదుగురిని విడుదల చేయాల్సొచ్చింది.
అలాంటిది ఇపుడు వారే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. రేపు అమెరికాతో ఏ విషయంలో అయినా చర్చలు జరపాల్సొస్తే వీరితోనే చర్చలు జరపాలి. ఇలాంటి చేదు అనుభవాలే తాలిబన్లకు చాలా దేశాలుకున్నాయి. అందుకనే మంత్రివర్గాన్ని చూసి ఇప్పుడు ఐక్య రాజ్య సమితి నెత్తీ నోరు మొత్తుకుంటోంది. అయితే ఎవరేమి అనుకున్నా, ఎంతగా మొత్తుకున్నా తాలిబన్లు, హక్కానీ నెట్ వర్క్ కావాలనే ఏరికోరి మంత్రులుగా నియమించుకున్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళ వెనకాల పాకిస్తాన్, చైనాలున్నాయి కాబట్టే.