కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, మధు యాష్కీల మధ్య వార్ మొదలైంది. వైఎస్ సంస్మరణ సభ వీరి మధ్య చిచ్చు పెట్టడం గమనార్హం. వైఎస్ షర్మిల పార్టీ కోసం ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఎవరూ వెళ్లొద్దంటూ టీపీసీసీ ఫత్వాను కాదని సభకు వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు.
పార్టీకి నష్టపర్చేలా కోమటిరెడ్డి మాట్లాడటం సరికాదన్న మధుయాష్కీ…. పార్టీని నష్టపర్చేలా మాట్లాడవద్దని హితవు పలికారు. తెలంగాణకు వ్యతిరేకంగా గతంలో విజయమ్మ మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నుండి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చన్న ఆయన… కోమటిరెడ్డి ఎదుగుదలకు సోనియానే కారణమన్నారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడవద్దని హెచ్చరించారు. సీతక్క వంటి నేతపై కోమటిరెడ్డి మాటలు ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎవరూ హైదరబాద్‌లో వైఎస్ విజయలక్ష్మి ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లవద్దని టీ పీసీసీ సూచించింది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకెంతో అనుబంధం ఉందని వెళ్లి తీరతానని కోమటిరెడ్డి ప్రకటించడమే కాకుండా వెళ్లారు. అక్కడకు వెళ్లి మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుకు రాఖీ కడితే లేని తప్పు వైఎస్ సంస్మరణకు తాను వస్తే వస్తుందా అని ప్రశ్నించారు. ఇంకా పలు రకాల విమర్శలు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో.. మధుయాష్కీ.. కోమటిరెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.