తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక రోజులు గడుస్తున్నా కొద్దీ మరింత మంట రాజేస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల పరస్పర ఆరోపణలు విమర్శలు విజయ వ్యూహాలు గెలుపు ప్రణాళికలు ఇలా ఇప్పుడందరి దృష్టి హుజూరాబాద్ మీదే ఉంది. భూ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ నుంచి విజయం కన్నేయగా.. ఈ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ ఈటలను ఓడించాలనే లక్ష్యం పెట్టుకుంది. దీంతో ఆ నియోజకవర్గంలో గులాబి జెండాను ఎగరేసే బాధ్యత తీసుకున్న మంత్రి హరీశ్ రావు.. ఈటల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాతావరణాన్ని వేడెక్కించారు. తాజాగా కాంగ్రెస్ నుంచి వెళ్లి కారెక్కిన కౌశిక్ రెడ్డి తన సంచలన వ్యాఖ్యలతో ఈ వేడిని మరింత పెంచారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనకు మద్దతుగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈటల ప్యాకేజీ ఇచ్చారని ఈ ఇద్దరి మధ్య రహస్య సమావేశాలు మంతనాలు జరుగుతున్నాయని ఆరోపించిన కౌశిక్ బాంబు పేల్చారు. అంతే కాకుండా ఈ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌లో ఈటల చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకర్ల సమావేశంలో ఈటల ఎక్కడ కూడా బీజేపీ గురించి మాట్లాడడం లేదని కాంగ్రెస్ మాటనే ఎత్తుకుంటున్నారని పేర్కొన్న కౌశిక్ తన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా మాట్లాడారు. మరోవైపు సభల పేరుతో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్న రేవంత్ ఇప్పటివరకూ హుజూరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని కౌశిక్ అన్నారు. ఈ ఉప ఎన్నికలో ఈటలదే గెలుపని రేవంత్ పదేపదే చెబుతున్నారని కౌశిక్ ఆరోపించారు.
ఇప్పుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేవంత్‌తో రహస్య పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఈటలకు ఏముందని ఓ వర్గం అంటుంటే.. నిప్పు లేనిదే పొగ రాదు కదా రాజకీయాల్లో తెరచాటును ఏం జరుగుతుందో చెప్పలేమని మరో వర్గం ప్రజలు అనుకుంటున్నారు. హుజూరాబాద్‌లో ఎప్పటి నుంచో ఈటలదే ఆధిపత్యం. టీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా గెలిచిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినప్పటికీ తనకు ప్రజల మద్దతు ఉంది. బీజేపీతో చేరినప్పటికీ ప్రజలు ఆయన్ని చూసే ఓటు వేస్తారే తప్ప పార్టీని చూసి కాదు. దీంతో గెలుపుపై ధీమాతో ఉన్న ఆయన ఆ దిశగా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్‌తో రహస్య మంతనాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదనేది ఆయన అనుచర వర్గం చెప్తున్న మాట.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డితో ఇలా చెప్పించడం ద్వారా ఈటలపై వ్యతిరేక భావాన్ని పెంపొందించడం కేసీఆర్ ఆలోచన అయి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా ఎలాగైనా విజయం కోసం పోరాడుతోన్న ఈటల ఆ దిశగా తెరవెనుకు రేవంత్‌తో సమావేశమయ్యారనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది అధికార పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని మరో వర్గం రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తనికి కౌశిక్ వ్యాఖ్యలపై ఇటు రేవంత్, అటు ఈటల ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates