రాబోయే గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లు బాగు చేయడానికి రెడీగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అంతేకాకుండా జనసైనికులు శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయడానికి రెడీగా ఉండాలని జనసేన నేతలు, యువ సైనికులతో పాటు వీర మహిళలకు పవన్ పిలుపిచ్చారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు తలెత్తింది కాదని గ్రహించాలి.
రాత్రికి రాత్రి ఏ రోడ్డు కూడా పాడైపోదు. ఎప్పటినుండో రోడ్ల నిర్వహణ సరిగాలేని కారణంగానే ఇపుడు రోడ్లకు ఈ స్ధితి దాపురించింది. సరే ఏ కారణంగా రోడ్డు పాడైపోయినా దాన్ని మరమ్మతులు చేయాల్సిన బాధ్యత, సరిగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలోనే జనసేన తరపున పవన్ వీడియో సందేశం తాజాగా విడుదలైంది. రోడ్ల పరిస్థితిపై తనదైన స్టైల్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రతిదానికి చంద్రబాబు పాలననే నిందిస్తుంటే కూర్చుంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలవుతున్న కారణంగా రోడ్లు బాగా లేదంటే అందుకు వైసీపీ ప్రభుత్వాన్నే నిందిస్తారు. ఇపుడు పవన్ చేసింది కూడా అదే. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా తయారైందన్నారు.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్ధితులను తాను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా రోడ్ల వ్యవస్థను పటిష్టం చేస్తుంటే ఏపీలో మాత్రం దారుణంగా ఉందన్నారు.
ఏదేమైనా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదనటంలో సందేహం లేదు. ప్రభుత్వం రోడ్లను బావుచేయకపోతే జనసేనే ఆ పనిని శ్రమదానంతో చేస్తుందని చెప్పడం చాలా మంచి విషయం. కాబట్టి గాంధీ జయంతి రోజున పవన్ చెప్పినట్లుగానే రోడ్ల మరమ్మతు పనులకు దిగితే ప్రభుత్వానికి అప్పటికైనా కదులుతుందేమో చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates