హుజూరాబాద్ అభ్య‌ర్థిపై కాంగ్రెస్ యూట‌ర్న్‌?

తెలంగాణ‌లో రాజ‌కీయాల‌న్నీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అధికార టీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఈ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్షంగా పోటీలో దిగ‌మ‌ని చెప్పిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల వేయి మంది నిరుద్యోగుల‌తో నామినేష‌న్లు వేయించే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇక ఐపీఎస్ అధికారిగా స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సార‌థ్యంలో ఆ పార్టీ హుజూరాబాద్‌లో పోటీ చేసే అవ‌కాశాలున్నాయి. స్వ‌యంగా ప్ర‌వీణ్ కుమార్ బ‌రిలో దిగిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై దృష్టి పెట్టిన దాదాపు అన్ని పార్టీలు ఆ దిశ‌గా కార్య‌చ‌ర‌ణ కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా త‌మ అభ్య‌ర్థి విష‌యంలోనే ఓ స్ప‌ష్ట‌త‌కు రాలేక‌పోతుంది. హుజూరాబాద్‌తో చేయి గుర్తు త‌ర‌పున పోటీచేసేది ఎవ‌ర‌నే విష‌యంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.

ఎవ‌రిని అభ్య‌ర్థిగా దింపాల‌నే అంశంపై పార్టీ రాష్ట్ర అగ్రశ్రేణి నాయ‌కులు తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్‌లో ప్ర‌ధాన పోటీ టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న‌ట్లుగానే ఉంటుంద‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ ఎన్నిక‌లో విజ‌యాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్‌.. ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు త‌న సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకుని టీఆర్ఎస్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని ఈట‌ల ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. వీళ్ల మ‌ధ్య‌లో దూరి ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌నే ఆశ ఎలాగో లేద‌ని టాక్‌. ఈ రెండు పార్టీల‌ని దాటి కాంగ్రెస్ గెల‌వ‌డం దాదాపు అసాధ్య‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హుజూరాబాద్‌లో గెల‌వ‌క‌పోయిన‌ప్ప‌టికీ పోటీ చేయాల‌ని కాంగ్రెస్ భావించింది. టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైన త‌ర్వాత తిరిగి జోరు అందుకున్న పార్టీ శ్రేణులు ఆ దిశ‌గా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ‌ను కాంగ్రెస్ ఖరారు చేసింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆగ‌స్టులోనే ఆమె పేరును అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం కూడా కొన‌సాగింది. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆమెనే అనుకుంటున్న స‌మ‌యంలో కాంగ్రెస్ మ‌ళ్లీ మాట మార్చింది.

స్థానిక నేత‌ల అభిప్రాయ సేక‌ర‌ణ అనంత‌ర‌మే త‌మ అభ్య‌ర్థిని సెప్టెంబ‌ర్ 10లోపు ప్ర‌క‌టిస్తామ‌ని తాజాగా వెల్ల‌డించింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని సామాజిక స‌మీక‌ర‌ణ‌లు స్థానిక ప‌రిస్థితులు ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు ఇలా అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఈ ఉప ఎన్నిక బ‌రిలో స్థానిక నేత‌నే నిల‌బెట్టాల‌ని తాజాగా జ‌రిగిన పీసీసీ ముఖ్య నేత‌ల స‌మావేశంలో కొందరు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

స్థానిక అంశం తెర‌పైకి రావ‌డంతో కరీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడు క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ పేరు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఆయ‌న్ని పోటీలో నిల‌బెట్ట‌డం గురించి చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రోవైపు ఇత‌ర ప్రాంతాల నాయ‌కుల‌ను హుజూరాబాద్‌లో పోటీలో నిలిపితే.. ఆ అభ్య‌ర్థి అంద‌రికీ తెలిసిన‌వారై ఉండాల‌నే పార్టీలోని మ‌రో వ‌ర్గం అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అభ్య‌ర్థి ఎంపిక‌పై ప్రాథ‌మిక క‌స‌ర‌త్తు పూర్తి చేసిన పార్టీ అయిదుగురి పేర్ల‌ను ప‌రిశీలిస్తోంది. మ‌రి ముందుగా ప్ర‌చారం జ‌రిగిన‌ట్లు కొండా సురేఖ‌ను పోటీలో పార్టీ నిలుపుతుందా? లేదా స్థానిక నేత‌కు అవ‌కాశం ఇవ్వాల‌నే ఉద్దేశంతో క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌కు అవ‌కాశం ఇస్తారా? అన్న‌ది మ‌రో 10 రోజుల్లో తేలిపోతుంది.