తెలంగాణా ప్రభుత్వంపై విద్యార్ధులు మండిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాది విద్యాసంవత్సరం జరగలేదని అందరికీ తెలిసిందే. కేజీ టు పీజీ వరకు విద్యార్ధులందరినీ ఆటోమేటిక్ పాస్ అని ప్రభుత్వం ప్రకటించేసింది. కాబట్టి విద్యార్థులంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. అలాంటిది తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఓ ప్రకటనతో ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్రంగా మండిపోతున్నారు. ఇంతకీ వీళ్ళ కోపానికి కారణం ఏమిటి ?
ఏమిటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులు తొందరలోనే పరీక్షలు రాయాలని ప్రకటించడమే. సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులంతా యాన్యువల్ పరీక్షలు రాయాల్సిందే అని సబితా చాలా చల్లగా ప్రకటించారు. అప్పుడేమో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి అందరినీ ఆటోమేటిక్ గా పాస్ చేసినట్లే అని ప్రభుత్వం ప్రకటించింది.
అంటే పరీక్షలు రాయకుండానే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు సుమారు 5 లక్షలమంది సెకెండ్ ఇంటర్మీడియట్ కు ప్రమోట్ అయినట్లే అనుకున్నారు. కాని తాజాగా పరీక్ష రాసి పాస్ అయిన వారిని మాత్రమే సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి ప్రకటన పై విద్యార్ధులు తీవ్రంగా మండిపోతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి పునః ప్రారంభమవుతున్న విద్యాలయాలపై సమీక్ష చేస్తారట.
తమ సమీక్షలో వచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని సబితా చెప్పారు. ఇపుడు చేసిన ప్రకటనే దో అప్పట్లోనే చేసుంటే సరిపోయేది. పరీక్షలు నిర్వహించకుండా మొదటి సంవత్సరం విద్యార్ధులును రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేయమని ప్రకటించుంటే బాగుండేది. ప్రభుత్వ ప్రకటన కు తగ్గట్లుగా విద్యార్ధులంతా మానసికంగా సిద్ధమయ్యేవారు. కానీ అప్పుడేమో పరీక్షలతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ పాస్ అని ప్రకటించే ఇప్పుడు పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసేది లేదని చెప్పడం ఏమిటో సబితకే తెలియాలి.