మోత్కుపల్లి నర్సింహులు.. ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ దళిత నాయకుడు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు.. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. ఒక్కసారిగా అందరూ మోత్కుపల్లివైపు చూసేలా చేశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష విరమించిచారు. దళిత బంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తీరుకు నిరసనగా తన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ దీక్ష ఆరు గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతిపక్ష పార్టీల దగ్గర నీతి లేదని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. వారికి అనుకోకుండానే దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. అనుకోకుండానే దళితుల కోసం యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి యాత్రలు ఎందుకు చేయలేదని అని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో తాను ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా దళితుల గురించి మాట్లాడలేదని చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపైనా.. మోత్కుపల్లి.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిట్ల వర్షం కురిపించారు.
“రాజకీయ బ్రోకర్ ఒక చిల్లర గాడు రేవంత్ రెడ్డి” అని రేవంత్‌ను విమర్శించారు. రేవంత్‌కు ఇన్ని వేల కోట్లు ఎక్కడివి? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ బ్లాక్ మెయిలర్ రేవంత్ అన్నారు. వెంచర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తాడని ఆరోపించారు. మల్లారెడ్డి దగ్గర టీడీపీలో ఉన్నప్పుడు కోట్లు తీసుకున్నవా లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ లాగానే కాంగ్రెస్ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లు ఉన్నారు వారికి రాని పదవి ఇతనికి ఎలా వచ్చిందన్నారు. తమకు అడ్డమొస్తే రేవంత్‌ను తొక్కేస్తామన్నారు.
దళితులకు 10 లక్షలు ఇస్తే ఆయన సీఎం కాలేడని, అందుకే వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తున్నాడని విమర్శించారు. దళిత రక్షకుడు, దళిత బంధువు సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధుతో విపక్ష పార్టీల్లో వణుకు పుడుతోందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా.. ఈటల రాజేందర్ గెలవడని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. ఆయన చేస్తున్న పాదయాత్ర ద్వారా హుజూరాబాద్ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయ భూములు ఆక్రమించి అమ్ముకున్నాడని ఆరోపించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో చీఫ్ పదవి కోసం ఎందరో సీనియర్లు ప్రయత్నించినా.. అది నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్‌కు ఎలా దక్కిందని ప్రశ్నించారు. ప్రస్తుతం మోత్కుపల్లి వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరో వివాదానికి దారితీస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.