తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యను భుజాలకెత్తుకున్న ఆమె అందుకోసం ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీ సహా పలు ప్రజా సమస్యలపై ఆమె పోరాటం చేస్తున్నారు. కానీ తన పార్టీకి ఇప్పటికీ రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆదిలోనే కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో షర్మిల జోరుకు బ్రేకు పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందిరా శోభన్ బయటకు వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పార్టీలో కొత్త ఉత్తేజాన్ని ఉత్సహాన్ని నింపే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం షర్మిలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) జట్టు కట్టనున్నట్లు సమాచారం.
ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో కీలక నేతల రాజీనామాలతో ఢీలా పడ్డ షర్మిల పార్టీలో నూతనోత్సహం రానుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వైఎస్సార్టీపీ పార్టీ కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన ఆయన సెప్టెంబర్ 1 నుంచి రంగంలోని దిగనున్నారనే టాక్ వినిపిస్తోంది. పీకే సలహాలు సూచనలతో ఇక పార్టీ వర్గాలు పూర్తి క్రియాశీలకంగా మారే అవకాశాలున్నాయని రాజకీయ వేత్తలు అనుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునే దిశగా ప్రశాంత్ కిషోర్ తన బృందాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పీకే నేరుగా ముందుకు రాకుండా తెరవెనక ఉండే అంతా నడిపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల సమయంలో అప్పుడు నేరుగా రంగప్రవేశం చేసి పార్టీ తరపున వ్యూహాలు అమలు చేస్తారని పార్టీ నేతలు అనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారంలోకి రావడంతో సహా పలు రాష్ట్రాల్లో పార్టీల విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారనే సంగతి తెలిసిందే. ఏపీలో అన్న జగన్‌ను ముఖ్యమంత్రిని చేసినట్లే.. తెలంగాణలో చెల్లి షర్మిలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు పీకే వ్యూహాలు రూపొందించినట్లు మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. షర్మిల పార్టీ ప్రకటనకు రెండు రోజులు ముందు ఆయన లోటస్ పాండ్‌లో కనిపించడం ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత దక్కేలా చేసింది. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం తాను ఇక వ్యూహకర్తగా పనిచేసేది లేదని, తన టీమ్ మాత్రం కొనసాగుతుందని పీకే ప్రకటించారు. కానీ అంతకంటే ముందే షర్మిల పార్టీతో చేసుకున్న ఒప్పందం కారణంగా అతను వైఎస్సార్ టీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాజకీయాలు భిన్నమైనవి. రాష్ట్రం ఏర్పడిన్పటి నుంచి కేసీఆర్‌దే పూర్తి ఆధిపత్యం. రెండు సార్లు ఆయన సారథ్యంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ఆయన ఇప్పటి నుంచి ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మధ్య సంజయ్ దూకుడుతో బీజేపీ.. రేవంత్ రెడ్డి జోరుతో కాంగ్రెస్ పుంజుకుంటున్నాయి. ఇప్పుడు షర్మిల కూడా రేసులో నిలిచింది. కానీ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న కేసీఆర్‌ను గద్దె దించాలంటే షర్మిలకు గొప్ప వ్యూహకర్త అవసరం. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను ఆ పార్టీ రంగంలోకి దించుతుందని టాక్. అక్టోబర్‌లో పాదయాత్ర చేపడతానని ప్రకటించిన షర్మిల.. అంతకంటే ముందే ప్రశాంత్ కిషోర్ విషయంలో ఓ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మరి ఆయన వ్యూహాలు ఫలించి షర్మిల అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది కాలమే నిర్ణయించాలి.