‘తమకు పాకిస్తాన్ రెండో ఇల్లు లాంటిది’ అని తాలిబన్లు తాజాగా చేసిన ప్రకటన చాలా కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే భారతదేశాన్ని అస్ధిరతపాల్చేయటం, మారణహోమాన్ని రేపటమే లక్ష్యాలుగా పాకిస్ధాన్ ఎన్ని కుట్రలు పన్నుతోందో అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం ఉన్న ప్రతి చోటా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ అవలంభిస్తున్న భారత్ వ్యతిరేకతను మనదేశం ఎండగడుతునే ఉంది.
తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన పరిణామాలను మన పాలకులు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్ధాన్+పాకిస్ధాన్+చైనా దేశాల నుండి మనకు ముప్పు ఎదురవుతుందేమో అనే ఆందోళన మన పాలకుల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన తాలిబన్ల పాలన, అరాచకాలకు తెరవెనుక పాకిస్థాన్, చైనాయే ఉందని యావత్ ప్రపంచం అనుమానిస్తోంది.
ఇలాంటి నేపధ్యంలోనే పాకిస్థాన్ తమకు రెండో ఇల్లు లాంటిదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించడం గమనార్హం. పాకిస్థాన్ తో తమ దేశం వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమంటే ఇప్పటికే సంబంధాలున్నాయని అంగీకరించడమే. ఈ విషయాన్ని మన పాలకులు మొదటి నుంచి నెత్తీ నోరు మొత్తుకుంటున్నది.
మన దేశానికి సంబంధించి పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు, తాలిబన్లు ఒకటే. ఎందుకంటే తన అవసరాలకు పాక్ పాలకులు చాలాకాలంగా తాలిబన్లను ఉపయోగించుకుంటున్న విషయం బయటపడినా పాక్ పాలకులు మాత్రం అంగీకరించటం లేదు. పాకిస్థాన్ తో తమకున్న సంబంధాలను ఎవరూ విడదీయలేరని చెప్పటంతోనే తాలిబన్లకు పాకిస్తాన్ ఎంతగా మద్దతుగా నిలుస్తోందో ప్రపంచానికి మరోసారి తెలిసివస్తోంది. మొత్తానికి తాలిబన్లు చేసిన తాజా ప్రకటనతో పాకిస్తాన్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates