వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వ్యూహం మార్చుకున్నారా ? తనకు ఇప్పుడు కాలం కలిసిరాని పరిస్థితి నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సాయిరెడ్డి పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఢిల్లీలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆయనకు ఇప్పుడు అదే ఢిల్లీలో కేంద్రం పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా.. ఆయన ఇవ్వలేదు. పైగా కొత్త విషయాలు లేవంటూ.. అప్పాయింట్‌మెంట్ కవర్‌కింద రాయించడం.. అది ఆలస్యంగా వెలుగు చూడడం గమనార్హం.
మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు.. ఎక్కడా తగ్గకపోవడం.. ఆయనను అనర్హుడిని చేయించే బాధ్యతలను జగన్.. సాయిరెడ్డిపై పెట్టడం వంటివి చర్చకు దారితీస్తున్నాయి. రఘురామను అనర్హుడిని చేసేందుకు.. దాదాపు ఏడాదిన్నర కాలంగా.. ప్రయత్నిస్తున్నా.. ఇప్పటి వరకు సాయిరెడ్డి సక్సెస్ కాలేక పోయారు. దీంతో ఆయనపై యాంటి ప్రచారం పెరిగింది. పైగా.. ఇటీవల రాజ్యసభలోనూ.. ఆయన అనుసరించిన వ్యూహానికి మార్కులు పడలేదు. చైర్మన్ వెంకయ్య నాయుడు పోడియంను చుట్టుముట్టి చేసిన ఆందోళన కూడా హైలెట్ కాలేదు. దీంతో సాయిరెడ్డి ఢిల్లీలో విఫలమవుతున్నారనే వాదన స్పష్టంగా వినిపిస్తోంది.
ఇంకోవైపు.. విశాఖలోనూ సాయిరెడ్డిని పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేకతను సంతరించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా సాయిరెడ్డి చక్రం తిప్పారు. అయితే.. ఆయనకు ఢిల్లీలో.. ఎదురవుతున్న పరిణామాలను గుర్తిస్తున్న విశాఖ రాజకీయ నేతలు.. సాయిరెడ్డిని తప్పిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా జరిగిన ఒక కార్యక్రమానికి సాయిరెడ్డికి ఆహ్వానం కూడా అందని పరిస్థితి ఏర్పడడం దీనిని మరింత బలోపేతం చేస్తున్నాయి.
జగన్ ప్రయార్టీ తగ్గుతుందన్న లీకులు రావడం.. పరిణామాలు గమనిస్తోన్న వైసీపీ నేతలు ఇప్పుడు సాయిరెడ్డిని కాస్త అలుసు తీసుకుంటోన్న పరిస్థితి.
ఈ క్రమంలో సాయిరెడ్డి ఆయా విషయాలపై నోరు విప్పడం లేదు. ఢిల్లీలో విఫలం కావడం.. విశాఖలో తన హవాకు బ్రేకులు పడుతున్న విషయాన్ని ఆయన నిశితంగా గమనిస్తున్నారు. అయితే.. ఆయా విషయాలపై వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates