హాకీ క్రీడాకారిణి రజనికి సీఎం జగన్ వరాల జల్లు

ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, అథ్లెట్లు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. ఇక, కాంస్య పతకం కోసం బ్రిటన్ తో జరిగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. అయితే, భారత మహిళల హకీ జట్టు పోరాట పటిమకు బ్రిటన్ జట్టుతో పాటు యావత్ భారత దేశం ఫిదా అయింది. మ్యాచ్ ఓడినా…కోట్లాది భారతీయుల హృదయాలు గెలుచుకున్నారంటూ ప్రధాని మోడీ సైతం భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఫోన్ చేసి అభినందించారు.

ఈ క్రమంలోనే భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు, ఉద్యోగాలు ప్రకటించి సముచితంగా గౌరవించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మహిళల హాకీ జాతీయ జట్టు సభ్యురాలు ఈ.రజనిపై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. రజనికి జగన్ రూ. 25లక్షల నగదు నజరానా ప్రకటించడంతో పాటు రజని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టోక్యో నుంచి తిరిగి వచ్చిన రజని….నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను తన తల్లిదండ్రులతో పాటు కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రజనీని సీఎం జగన్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. తిరుపతిలో రజనికి 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని అధికారులను జగన్ ఆదేశించారు. దీంతోపాటు, గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలేనికి చెందిన రజని 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌ లోనూ భారత జట్టుకు ఎంపికయ్యారు. కామన్ వెల్త్ గేమ్స్ లోనూ సత్తా చాటిన రజని ఇప్పటిదాకా 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో రాణించారు.