ఒకప్పుడు.. ఐపీఎస్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచి.. అందరి దృష్టి ఆకర్షింంచి.. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటైన జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. ఐఏఎస్ టాపర్స్ జంట టీనా దాబి, అధర్ ఆమిర్ ఖాన్ విడిపోయారు. ఐఏఎస్ పరీక్షలో ఫస్ట్ , సెకండ్ ర్యాంకులు సాధించిన వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
అయితే రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గతేడాది నవంబరులో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. విడాకులు మంజూరయ్యాయి.
2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో టీనా దాబి ఫస్ట్ ర్యాంకు సాధించగా.. అధర్ సెకండ్ ర్యాంకు సాధించారు. సివిల్స్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి దళిత మహిళగా టీనా దాబి పేరు అప్పట్లో మార్మోగింది. అనంతరం శిక్షణ సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమకు దారి తీసి ఆపై పెళ్లి చేసుకున్నారు.
అలా 2018లో ఏప్రిల్లో వీరు పెళ్లిచేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates