తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోరిప్పారు. ఉపఎన్నికలో నిరుద్యోగులు ఎవరన్నా పోటీచేస్తే వారికి తమ పార్టీ మద్దతుగా నిలబడుతుందని షర్మిల ప్రకటించారు. నియోజకవర్గంలోని సిరిసేడు గ్రామంలో మంగళవారం జరిగిన నిరుద్యోగ సమస్యల నిరాహార దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై షర్మిల నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.
హుజూరాబాద్ ఉపఎన్నికల వల్ల సమాజానికి ఎలాంటి లాభం ఉండదు కాబట్టే తమ పార్టీ పోటీ చేయదని షర్మిల స్పష్టంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పోటీపై అంత స్పష్టంగా ప్రకటించిన షర్మిల తాజా మద్దతు విషయంపై ప్రకటన చేశారు. నిరుద్యోగులు పోటీచేస్తే మద్దతు ఇస్తానని చేసిన ప్రకటనను కొందరు స్వాగతిస్తున్నారు. అయితే నిరుద్యోగులు పోటీచేసేంత సీన్ ఇక్కడ కనబడటంలేదు. ఎందుకంటే గెలుపుకోసం ఒకవైపు అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటోంది.
ఇదే సమయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా రంగంలోకి దూకటానికి రెడీగా ఉన్నాయి. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు కారకుడైన ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు. ఇన్ని పార్టీల మధ్య ఓ నిరుద్యోగి పోటీ చేస్తారని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే కేసీయార్ మీద కోపంతో నిరుద్యోగులందరు కలిసి ఎవరినైనా పోటీలోకి దింపుతారేమో చెప్పలేం.
షర్మిల చేసిన ప్రకటన కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే వైఎస్సార్టీపీకి ఉన్న జనాల మద్దుతుపైన కూడా ఓ అంచనాకు రావచ్చు. నిరుద్యోగ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు పడుతుందో ? అందులో షర్మిల పార్టీ ఓట్లెన్ని అన్న విషయాలను విడదీయలేకపోయినా ఓ అంచనాకు అయితే రావచ్చు. ఎన్ని ఓట్లుపడతాయనే విషయాన్ని పక్కనపెట్టేస్తే షర్మిల పార్టీ తరపున పనిచేయబోయే నేతలు ఎంతమంది అనే విషయంపై జనాలకు ఓ క్లారిటి వచ్చేస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates