ఈటల దెబ్బకు దళిత బంధువైపోయారా ?

ఈటల దెబ్బకే కేసీయార్ అర్జంటుగా దళిత బంధువైపోయినట్లున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనాలందరికీ లేకపోతే ఏదో ఓ సెక్షన్ కు అర్జెంటుగా బంధువైపోతుంటారు. లేదా వరాల జల్లు కురపించేస్తుంటారు. సరే ఒక్కోసారి వర్కవుటవుతుంది ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంటుంది. ఇపుడు టాపిక్ అంతా తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించే.

ఈ నియోజకవర్గంలో సుమారు 45 వేల దళితుల ఓట్లున్నాయి. ఉపఎన్నికలో గెలవడం కేసీయార్ కు చాలా ప్రెస్టీజియస్ ఇష్యు అయిపోయింది. నిజానికి ఉప ఎన్నికలో గెలిచినా, ఓడినా ఈటలకు ఒకటే. గెలిస్తే నియోజకవర్గంలో తనకు పట్టుందని నిరూపించుకున్నట్లవుతుందంతే. ఓడితే అధికార దుర్వినియోగం చేశారని, ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపణలు చేసేందుకు ఈటలకు ఎలాగూ అవకాశముంది.

ఇదే సమయంలో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే కేసీఆర్ కు వ్యక్తిగతంగా చాలా ఇబ్బందైపోతుంది. అసలే సీఎం మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పదే పదే కేసీఆర్ మీద ఆరోపణలతో రెచ్చిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గనుక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే పార్టీ నేతలకు, జనాలకు సమాధానం చెప్పుకోవడం కేసీయార్ కు కష్టమే.

ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సిందేమంటే ఉప ఎన్నికలో ఓడితే దళిత బంధు పథకం రాష్ట్రమంతా అమలవుతుందా అనేది డౌటే. ఎందుకంటే ఆ మధ్య దుబ్బాక ఉప ఎన్నికలో కూడా కేసీయార్ చాలా హామీలిచ్చారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. నాటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడిగిన వాళ్ళు లేరు చెప్పిన వాళ్ళూ లేరు.

తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తండ్రి, కొడుకులు చాలా హామీలనే ఇచ్చారు. వాటిలో ఎన్ని అమలవుతున్నాయో వాళ్ళే చెప్పాలి. గట్టి వర్షం ఒకటి పడితే చాలు పేరుగొప్ప హైదరాబాద్ మొత్తం కంపు కొట్టేస్తుంటుంది. కాలువేదో తెలీదు, రోడ్డేదో తెలీదన్నట్లయిపోతుంది. ఇలాంటి నేపధ్యంలోనే దళిత బంధు పథకం అమలుపై జనాల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం అన్నీ ప్రశ్నలకు ఉప ఎన్నికే సమాధానం చెబుతుంది.