భయం గొల్పుతున్న ముంబయి హాస్పిటల్ ఫొటో

లాక్ డౌన్ సడలింపులు వచ్చేశాయి. జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ప్రయాణాలు సాగిపోతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరిగేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ప్రభావం బాగా తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ ఆ మహమ్మారి అత్యంత ప్రభావం చూపిస్తున్నది ఇప్పుడే.

రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాల స్థాయికి భారత్ వచ్చేసింది. నిన్నట్నుంచి 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఆరు వేలకు పైగా కేసులు, 150 దాకా మరణాలు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మొత్తం దేశంలో కరోనా కేసులు లక్షా 45 వేల దాకా ఉండటం గమనార్హం. గత పది రోజుల వ్యవధిలోనే 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటిపోయింది.

ఇక మహారాష్ట్రలో అయితే కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే దేశవ్యాప్త కేసుల్లో మూడు వంతు ఉన్నాయి. కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇప్పటిదాకా 1635 మంది చనిపోయారు. మెజారిటీ కేసులు ముంబయిలోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముంబయిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రభుత్వం టేకోవర్ చేసింది.

ప్రతి కోవిడ్ ఆసుపత్రీ కిక్కిరిసి కనిపిస్తోంది. ముంబయిలోని కేఈఎం ఆసుపత్రిలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. చనిపోయిన వారిని మార్చురీ దగ్గర కవర్లలో చుట్టి టేబుళ్ల మీద పడుకోబెట్టిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతదేహాలు డబుల్ డిజిట్లో కనిపిస్తున్నాయి. ఇది అక్కడి కోవిడ్ మరణాల తీవ్రతకు అద్దం పెడుతోంది. ఒక్క ముంబయి సిటీలోనే 30 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వెయ్యి మందికి పైగా మరణించారు.