వైఎస్ వివేకానందరెడ్డికి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దొరికినట్లేనా ? సీబీఐ దూకుడు చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. వివేకా హత్య దర్యాప్తును సీబీఐకి ఇచ్చిన తర్వాత కూడా చానాళ్ళు పెద్దగా పురోగతి కనిపించలేదు. అయితే దర్యాప్తు తీరుపై మొదలైన ఆరోపణలు, విమర్శల కారణంగా సీబీఐ అధికారులు జోరుపెంచారు. దాంతో వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్యను విచారించారు. దీంతో కాస్త డొంక కదిలింది.
కదిలిన డొంక కారణంగా హతుని మాజీ డ్రైవర్ దస్తగిరి, మరో వ్యక్తి సునీల్ యాదవ్ లాంటివాళ్ళను కూడా అరెస్టు చేశారు. దాంతో హత్యకు వాడిన ఆయుధాల విషయం బయటపడింది. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ చెప్పిన వివరాల కారణంగా ఆయుధాలను పులివెందులకు సమీపంలోని ఓ మురుగు కాలువలో పడేసినట్లు తెలిసింది. దాంతో పులివెందుల మున్సిపాలిటిలోని పారిశుధ్య పనివారిని పిలిపించి మురుగుకాల్వలో వెతుకులాట మొదలుపెట్టటారు.
మురుగుకాల్వ సుమారు 8 అడుగుల లోతుంది. దాంతో ముందు కాల్వలోని మురుగునీటిని బయటకు తోడేయటం మొదలైంది. శనివారమంతా సీబీఐ ఇదే పనిని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తోంది. శనివారం కొంత నీటిని తోడేసినా ఇంకా తీయాల్సిన మురుగునీరు చాలాఉంది. దాంతో ఆదివారం కూడా మురుగునీటిని తోడేసేపని ముమ్మరంగా జరుగబోతోంది. ఆదివారం గనుక ఆయుధాలు బయటపడితే హత్య దర్యాప్తు విషయం చాలా కీలకంగా మారబోతోంది.
ఎలాగంటే హత్యాయుధలపై కచ్చితంగా వేలిముద్రలుంటాయి. దాదాపు రెండేళ్ళక్రితం జరిగిన హత్య కాబట్టి ఇప్పటికీ వేలిముద్రలు గనుక చెరిగిపోకుండా ఉంటే వాటి ఆధారంగా హంతకులను పట్టుకోవటం తేలికవుతుందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇదంతా ఆయుధాలపై వేలిముద్రల దొరకటంపైనే ఆధారపడుంటుంది. మొత్తానికి తొందరలోనే వివేకా హత్య మిస్టరీ విడిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.