ఏపీలో మళ్లీ రాజకీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈరోజు రేపట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా? సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఇద్దరు టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. వారు వైసీపీలో చేరకపోయినా… కండువా కప్పుకోకపోయినా మానసికంగా వైసీపీలో చేరిపోయారు. ప్రభుత్వానికి అన్నింటా మద్దతు పలుకుతున్నారు.
తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. పరుచూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు ఈ సాయంత్రం జగన్ ని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్ రాయబారంతో వీరిద్దరు జగన్ పంచన చేరేందుకు సిద్దమయ్యారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి అసెంబ్లీ సమావేశాల్లో నేను ఏ ఎమ్మెల్యేలను చేర్చుకోను, ఫిరాయింపులను ప్రోత్సహించను అని ముఖ్యమంత్రి హోదాలో జగన్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీతో రాజకీయ పోరులో జగన్ ఆగ్రహం నుంచి కొత్త ఆలోచన పుట్టుకువచ్చినట్టు అర్థమవుతోంది. తనను రకరకాలుగా ఇరకాటంలో పెడుతున్న టీడీపీకి ఊపిరి తిరగకుండా చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లున్నారు.
కండువా కప్పకుండా, పార్టీలో చేరకుండా… పాము చావాలి, కట్టె విరగకుండా అన్న చందాన వ్యూహాత్మక అడుగులతో ఏపీ రాజకీయాల్లో సంచలన మలుపులు తిప్పుతున్నారు జగన్. ఇప్పటిే అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటంతో టీడీపీలో కలకలం అయ్యింది. అటు బీజేపీ ఎంపీలను, ఇటు వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటూ బాబుతో రాజకీయ క్రీడ ఆడుతున్నారు. జగన్ రాజకీయానికి బాబు అనభవం కూడా షాక్ కి గురయ్యింది. మరి ఈరోజు రేపట్లో పరిణామాలు ఎలా మారతాయో చూడాలి. ఈ చేరికలు, దూరమవడాలు నిజమేనా అన్నది వేచిచూస్తే గాని తెలియదు. కానీ ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates