అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

బాలీవుడ్ మెగస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఒక్క కాల్ తో.. ముంబయి పోలీసులు కాసేపు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అమితాబ్ ఇంటితోపాటు.. ముంబయిలోని మూడు రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టామంటూ బెదిరించాడు గుర్తు తెలియని వ్యక్తి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అమితాబ్ ఇంటికి వెళ్లారు. పలు రైల్వే స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు.

బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. అయితే ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. దీంతో అది ఫేక్ కాల్ అని తేల్చారు. ఆగస్టు 15 దగ్గర పడుతుండడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపు కాల్ పై దర్యాప్తు జరుగుతోంది.