ఈటెలను కేసీయారే బలోపేతం చేస్తున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలో ఇదే అనుమానం పెరిగిపోతోంది. మంత్రివర్గం నుండి బహిష్కరించింది మొదలు ఈటల ఎంఎల్ఏగా రాజీనామా చేసినప్పటి నుండి కేసీయార్ ప్రతిరోజూ హుజూరాబాద్ నియోజకవర్గం జపమే చేస్తున్నారు. తొందరలో జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేసీయార్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో తన నియోజకవర్గంలో మళ్ళీ తానే గెలవాలని ఈటల నియోజకవర్గంలో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఈటలను ఓడించాలనే విషయంలో కేసీయార్ చూపిస్తున్న పట్టుదలను చూసిన తర్వాత అందరు ఆశ్చర్యపోతున్నారు. అవసరానికి మించి నియోజకవర్గంపై కేసీయార్ చూపిస్తున్న ప్రత్యేక దృష్టి వల్లే ఈటల ఇమేజి పెరిగిపోతోంది. ఈటల బలమైన నేత కాబట్టే కేసీయార్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం పెరిగిపోతోంది. హుజూరాబాద్ లో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కేసీయార్ వరసబెట్టి మొదలుపెట్టేశారు.

దళితబంధ పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ ను ఎంపికచేయటం, రెండో విడత గొర్రెల పంపిణీ, దళిత కాలనీల్లో మౌళికవసతుల ఏర్పాటు, షాదీముబారక్ పేరుతో భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కల్యాణలక్ష్మి పథకం అమలు, రోడ్లు వేయించటం లాంటివన్నీ హుజూరాబాద్ లో చకచక జరిగిపోతున్నాయి. కేవలం ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రు. 2 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు.

ఇదంతా చూసిన తర్వాత ఈటల గెలుస్తాడనే భయంతోనే టీఆర్ఎస్ గెలుపుకు కేసీయార్ నానా అవస్తలు పడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. జరుగుతున్నది చూసిన తర్వాత ఈటలను కేసీయారే బలోపేతం చేస్తున్నారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో బీసీలు ఓట్లు సమారుగా లక్షదాకా ఉన్నాయి. ఈటల కూడా బలమైన బీసీ నేత కావటంతో బీసీల్లో అత్యధికులు ఈటలకే మద్దతుగా నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది.

బీసీల ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కు పడేది అనుమానమవటంతోనే కేసీయార్ దృష్టి ఎస్సీలపై పడిందట. రెడ్లను ఆకట్టుకునేందుకే పదిరోజుల క్రితమే పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డిని కేసీయార్ ఎంఎల్సీ చేశారు. ఓ ఎస్సీ నేతను ఎస్సీ కొర్పొరేషన్ కు ఛైర్మన్ను చేశారు. ఇపుడు ఉపఎన్నిక వచ్చిందికాబట్టే, ఈటలను ఓడించాలనే పట్టుదల వల్లే కేసీయార్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కాబట్టి నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీలతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్లు ఎవరికి పడతాయనేది సస్పెన్సుగా మారింది.