మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ప్రజా దీవెన యాత్రతో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ ను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, 12వ రోజు పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక దగ్గర ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ప్రత్యేక బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. అయితే, హైదరాబాద్ లో ఆయన చేరిన ఆస్పత్రి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పాదయాత్రలో ఈటల కాళ్లకు పొక్కులు రావడం, తీవ్ర అలసట, గొంతు బొంగురు వంటి సమస్యలతో బాధపడుతుండగా ఆయనకు చికిత్స అందించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఈటలకు బీపీ, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, షుగర్ లెవల్స్ పెరిగినట్లు గుర్తించారు. అనంతరం హైదరాబాద్కు తీసుకువచ్చారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్య పరీక్షల తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
సహజంగా తెలంగాణకు చెందిన నేతలు అస్వస్థతకు గురైనప్పుడు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే, ఆ ఆస్పత్రికి అధికార పార్టీతో సంబంధాలున్నాయనే ఉద్దేశంతో ఈటలను అపోలో ఆస్పత్రిలో చేర్పించారని అంటున్నారు. పైగా, అపోలో ఆస్పత్రి యాజమాన్యం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులనే సంగతి తెలిసిందే. ఈటలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కోణంలోనే ఆయన్ను అపోలోలో చేర్పించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates