రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. నేతలకు వన్నతో పెట్టిన విద్య. తాడితన్నేవాడు ఉంటే.. వాడి తలతన్నేవాడు ఉంటాడన్నట్టుగా.. రాజకీయ నేతలు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. తమ వ్యూహాలను అమ లు చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా తెలంగాణలోని హుజూరాబాద్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఎందుకు ఉప ఎన్నిక జరుగుతోంది? అనే విషయం అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బయటకు పంపేయడంతో.. ఆయన కేసీఆర్ పై ధ్వజమెత్తి.. బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఈటలను ఓడించేందుకు.. సీఎం కేసీఆర్ ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. ఎందుకంటే.. ఈటలను అంతతక్కువగా అంచనా వేసేందుకు అవకాశం లేదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆయన ఇక్కడి ప్రజలకు చేరువయ్యారు. ప్రతి గడపకు ఈటల పరిచయమయ్యారు. ప్రతి ఒక్కరికీ చేరువయ్యారు. తాను మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఇక్కడ పనులు జరిగే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వరుసగా ఆయనను ఇక్కడి ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి చోట.. ఆయనను తక్కువగా అంచనావేసే వీలు లేకపోవడంతో కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే.. కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినప్పటికీ.. అమలు చేయని ఈ పథకాన్ని ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా.. హుజూరాబాద్‌లోనే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున లబ్ధి చేకూరనుంది. అంటే.. దీనివెనుక.. ఎన్నికల వ్యూహం ఉందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇక, ఓట్ల పరంగా చూసుకుంటే.. హుజూరాబాద్‌లో 45 వేల మంది దళితుల ఓట్లు ఉన్నాయి.
ఇప్పుడు దళిత బంధు పథకం ద్వారా.. ఆయా ఓట్లు.. టీఆర్ ఎస్‌కే దఖలు పడతాయని.. తద్వారా.. ఈటల ను ఎంతో కొంత మార్జిన్‌తో అయినా.. ఓడించవచ్చనేది.. కేసీఆర్ వ్యూహం. నిజానికి ఎన్నికలకు ముందు వేసిన ఈ వ్యూహం బీజేపీలోను.. ఈటల రాజేందర్‌లోనూ ఒకవిధమైన అలజడికి కారణమైందనే చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని దెబ్బకొట్టడం కోసమే కేసీఆర్ దళిత బంధును తీసుకొచ్చారన్న చర్చ కమలనాథుల్లో కలవరం సృష్టిస్తోంది. దళితులు అందరూ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరిపోతే.. తమ పరిస్థితి ఏంటని.. కమల నాథులు తలలు పట్టుకున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ నాయకులకు అద్భుతమైన ఐడియా వచ్చింది. కేసీఆర్ ఎత్తును చిత్తు చేసేలా వారు.. మరో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దళిత బంధు.. ఈటల రాజేందర్ పుణ్యమేనని కమలనాథుల ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయకుంటే.. కేసీఆర్‌కు దళితులు గుర్తు వచ్చేవారు కాదని బీజేపీ నేతలంటున్నారు. ఇదే అంశాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇది కనుక సక్సెస్ అయితే.. కేసీఆర్ డబ్బులు పంచినా.. దీనికి ఈటల కృషే కారణమనే వాదన ప్రజల్లో బలపడి.. ఓట్లు చీలకుండా ఉంటాయనేది.. బీజేపీ వ్యూహం.
అదే సమయంలో.. దళిత బంధును స్వాగతిస్తూనే ఎస్టీలకు సైతం కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలనేది బీజేపీ తెరపైకి తీసుకొస్తున్న డిమాండ్. ఎస్సీలతో పాటు ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌నూ కమలనాథులు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే స్లోగన్‌తో పెద్ద యెత్తున ప్రజల్లోకి వెళ్ళాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీంతో ఎస్టీ ఓట్లు.. టీఆర్ ఎస్‌కు పడకుండా.. తమకు ద్రోహం చేస్తున్నారనే వాదనను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. సో.. ఈ రెండు వ్యూహాలతో కేసీఆర్ ఎత్తు.. చిత్తవుతుందా? బీజేపీ వ్యూహం సక్సెస్ అవుతుందా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates