కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎంట్రీ దాదాపు ఖాయమైపోయినట్లే. కాకపోతే పీకేని పార్టీలోకి తీసుకుంటే ఏ స్ధాయిని కట్టబెట్టాలి ? ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి ? అనే విషయమే పార్టీ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఈ విషయమై రాహూల్ గాంధి పార్టీలోని సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆనందశర్మ, కమలనాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, అజయ్ మాకెన్, అంబికా సోనీ లాంటి నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడిని గద్దెనుండి దింపాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలన్న పీకే సలహాను ఇప్పటికే జాతీయస్ధాయిలోని చాలామంది ప్రతిపక్ష నేతలు అంగీకరించారు. మోడిని ఓడించటమే ఏకైక టార్గెట్ గా పశ్చిమబెంగాల్ సీఎం మమతబెనర్జీ, మాజీ సీఎం శరద్ పవార్ తో కలిసి పీకే ఇప్పటికే చాలాసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లాంటి అనేక పార్టీలకూ ఎన్డీయేని ఓడించాలని ఉందికానీ మార్గమే కనబడటంలేదు. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ బలహీనమైపోవటంతోనే చాలాపార్టీలు దెబ్బతినేశాయి.
ఈ నేపధ్యంలోనే పీకే రంగంలోకి దిగారు. మమత ప్రోత్సాహంతోనే పీకే వివిధ పార్టీల అధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే సోనియాగాంధి, రాహూల్, ప్రియాంకలతో కూడా రెండుసార్లు భేటీ అయ్యారు. వీళ్ల భేటీ తర్వాత సోనియా+రాహూల్ తో మమత భేటీ అయ్యారు. సో, ఈ నేపధ్యంలోనే పీకేని కాంగ్రెస్ లో చేర్చుకోవాలనే చర్చలు జరగటం అందుకు వ్యూహకర్త కూడా రెడీ అవటం చకచక జరిగిపోయాయి.
అయితే ఇంతమంది సీనియర్లను కాదని పీకేని సోనియా, రాహూల్ నెత్తిన పెట్టుకోలేరు. ఎందుకంటే అలా జరిగితే మొదటికే మోసం వస్తుందనే భయముంది. అందుకనే కొందరు సీనియర్లతో సోనియా సూచన ప్రకారం రాహూల్ భేటీ అయ్యారు. పీకేని పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించాలనే విషయంలో సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందట. కాకపోతే ఆ స్ధాయి ఏమిటనే విషయమే ఇంకా తేలలేదట.
రాష్ట్రంలోని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పీకేకి సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ లేదా యూపీఏతో ఇతర పార్టీలను సమన్వయం చేసే బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని సీనియర్లు రాహూల్ కు సూచించారట. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రాజకీయ వ్యూహకర్తగా పీకేకి చాలా పార్టీల అధినేతలతో మంచి సంబంధాలుండటమే. అయితే ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే ఇప్పటికే ఎన్డీయేకి వ్యతిరేకంగా యూపీఏ ఉంది. కొత్తగా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమత పదే పదే సూచిస్తున్నారు. యూపీఏకి అదనంగా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలా ? లేకపోతే రెండింటిని కలిపేయాలా ? అనేదే తేలటంలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates