కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా మజాకానా? అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ఏళ్లకు ఏళ్లుగా ప్లానింగ్ చేసి.. తాను అనుకున్నట్లుగా పవర్ ను అరచేతిలోకి తీసుకున్న ఆయన.. దాన్నిఅంత తేలిగ్గా వదులుకుంటారా? అధికారాన్ని చేజిక్కించుకోవటానికి పవర్ లేనప్పుడు ఎంతో ప్రయత్నించిన ఆయన.. చేతినిండా పవర్ ఉన్నప్పుడు అధికారాన్ని తాను అనుకున్నంత కాలం తన వద్దే నిలుపుకోవటానికి దేనికైనా సిద్దమవుతారు. స్వతంత్ర భారతంలో సర్వాధికారాలున్న కేంద్ర ప్రభుత్వం సైతం చేయని సంచలన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. తన మానసపుత్రిక అయిన ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలుకు రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు సైతం తాను వెనుకాడనని తాజాగా స్పష్టం చేశారు.
త్వరలో జరగనున్న హూజూరాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధు ప్రధాన ప్రచార అంశంగా మార్చేందుకు వీలుగా.. ఇప్పుడీ పథకాన్ని హడావుడిగా తెర మీదకు తీసుకొచ్చారన్న మాట వినిపిస్తున్న వేళలో ఎవరూ ఊహించని ప్రకటనను చేశారు కేసీఆర్. తాను ప్రకటించిన తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు రూ.80వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. పథకాన్ని సక్సెస్ చేసి చూపిస్తానని.. ప్రతి దళిత వాడలో ఒక కేసీఆర్ పుట్టాలన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు.. దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తులను చేసే పథకంగా మారుతుందన్నారు. ఆ మేరకు అందరం కలిసి పథకాన్ని విజయవంతం చేద్దామంటూ దళిత ప్రజాప్రతినిధులు.. పలు సంఘాల నేతలకు పిలుపునిచ్చిన కేసీఆర్ ఏమేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
- ష్ట్రంలో దళిత బంధు విజయవంతానికి ప్రతి దళిత బిడ్డ పట్టుబట్టి పని చేయాలన్నారు. ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్ పుట్టాలి. హుజూరాబాద్‌లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు.. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా విస్తరించాలి.
- రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు, ఇట్లా 100 ఏళ్ల పాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నరు. అన్ని రంగాలను ఒక్కటొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నం. తెలంగాణ గాడిలో పడింది.
- ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా? అని అనుమానపడ్డరు. వచ్చింది! 24 గంటలు కరెంటు అయ్యేదా పొయ్యేదా? అన్నరు. అయ్యింది! కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అయితదా? అన్నరు. అయింది! దండుగన్న వ్యవసాయం పండుగైంది!
- రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచిన్రు. ఇవ్వాళ తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నరు! అట్లనే దళితబంధును కూడా కొందరు అనుమానపడుతున్నరు. వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తం. అదే స్ఫూర్తితో దళితబంధును అమలు చేస్తం. విజయం సాధిస్తం.
- తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులి పిల్లలాంటి వాళ్లనే సంగతిని స్వయంపాలన ఏర్పాటయినంక ప్రపంచం పసిగట్టింది. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నివ్వెర పోతున్నది. దళితబంధును విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజానికే కాదు.. దేశ దళిత సమాజాభివృద్ధికి హుజూరాబాద్ దళితులే దారులు వేయాలి.
- ఇన్నాళ్లూ ఏవేవో పథకాలను తెచ్చి ప్రభుత్వాలు బ్యాంకుల గ్యారంటీ అడిగినయి. కాళ్లూ చేతులే ఆస్తులుగా ఉన్న కడు పేద దళితులు గ్యారంటీలను ఎక్కడి నుంచి తెస్తరు? అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థికసాయం పూర్తి ఉచితం. ఇది అప్పు కాదు.
- దళితుల్లో ఆత్మ విశ్వాసం, ధీమా పెరిగి తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోగలం అనే భరోసాను కలిగించే ప్రయత్నమే దళితబంధు పథకం. ఇచ్చిన పైసలను పప్పు పుట్నాలకు ఖర్చు చేయకుండా, పైసను పెట్టి పైసలను సంపాదించే ఉపాధి మార్గాలను అన్వేషించాలి.
- మంచి జరిగి వెలుతురొస్తే.. అణగారిన దళిత వర్గాలందరికీ మేలు జరిగి ఒక తొవ్వ పడుతుంది. హుజూరాబాద్ దళిత నాయకుల పట్టుదల, నిబద్ధత, చిత్తశుద్ధి మీద ఇది ఆధారపడి ఉంది. పార్టీలకతీతంగా దళితబంధును అమలు చేసుకుందాం. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలె. కొట్లాటలు, కక్షలు, లేని వాడలుగా దళిత వాడలు పరిఢవిల్లాలె.