కరోనా ఫస్ట్ దశలోనే ప్రజలు అల్లాడిపోయారు. ఒక వేరియెంట్ ఉంటేనే ప్రాణాలు పోయిన పరిస్థితి కనిపించింది. అయితే.. ఇప్పుడు కరోనా మరింతగా విజృంభించింది. కరోనా వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకొస్తున్న వేళ.. ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన దేశంలో తొలిసారి వెలుగుచూసింది. అసోంలోని ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు. ఆమె నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు.
ఈ డబుల్ ఇన్ఫె క్షన్‌పై స్పష్టత కోసం మరోసారి నమూనాలను సేకరించి, పరీక్షించారు. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు నిర్ధరించుకున్నారు. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు. ఆ తర్వాత.. వైద్యురాలు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక, ఇందో చిత్రం ఏంటంటే.. ప్రస్తుతం రెండు వేరియెంట్ల బారిన పడ్డ వైద్యురాలు టీకా రెండు డోసులు వేయించు కున్నారు. అయినప్పటికీ.. ఆమెకు రెండు వేరియెంట్లు ఒకేసారి కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు వైద్య నిపుణులు.
డబుల్ వేరియెంట్లను పరిశీలిస్తే.. ఇప్పటికే ప్రపంచంలో ఒకే ఒక దేశం బెల్జియంలో కేసు వెలుగు చూసింది. ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఈ డబుల్ ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆమెలో ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లను గుర్తించారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ వృద్ధురాలు అసలు టీకా వేయించుకోలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలియజేశారు. కానీ, ఇప్పుడు.. దేశంలో తొలి డబుల్ వేరియెంట్ కేసు నమోదు కావడం.. అందునా రెండు డోసుల టీకా తీసుకున్నాక ఇలాంటి లక్షణాలు కనిపించడం.. వంటివి కరోనా తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు వైద్యులు.