పవార్ కు మోడి గాలమేస్తున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడితో మహారాష్ట్రలోని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్డీయే కు బలమైన ప్రత్యర్ధిగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావటంలో పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం అందరు చూస్తున్నదే.

ఇలాంటి నేపధ్యంలో మోడి-పవార్ భేటీ జరగటం సంచలనంగా మారింది. ఎలాగైనా పవార్ ను ఎన్డీయేలోకి లాక్కోవాలనే ప్రయత్నాలు ఎప్పటినుండో జరుగుతున్నాయి. అయితే ఆ ప్రయత్నాలకు పవార్ దూరంగా జరుగుతున్నారు. ఇలాంటి సమయంలోనే హఠాత్తుగా వీళ్ళద్దరి భేటి దేనికి సంకేతాలో అర్ధం కావటంలేదు. మహారాష్ట్రలో సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయరంగంలో నుండి సహకార రంగాన్ని విడదీసి కేంద్రం ప్రత్యేకమైన శాఖకు ఏర్పాటుచేసింది.

ఈ విధంగా ఏర్పడిన సహకార శాఖలో వేలకోట్ల రూపాయల రుణాలు పేరుకుపోయున్నాయి. వీటిల్లో అత్యధికం మహారాష్ట్ర వాటానే ఉంది. ఇందులో కూడా ఎన్సీపీ నేతలదే ఎక్కువ షేరుందట. అంటే సహకారరంగంలో తీసుకున్న వందల కోట్ల రూపాయల రుణలను కొందరు ఎన్సీసీ నేతలు ఎగొట్టారట. దాంతో రుణాలు ఎగొట్టిన నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు దాడులు చేయటమే కాకుండా కేసులు నమోదు చేస్తోంది. ఈ విషయం మాట్లాడేందుకే మోడితో పవార్ భేటీ అయినట్లు సమాచారం.

మొత్తానికి ఏదో రూపంలో పవార్ ను మోడి తన దగ్గరకు రప్పించుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఇపుడు రప్పించుకున్నారు సరే తర్వాత స్టెప్ ఏమిటి అనేదే అందరికీ అర్ధం కావటంలేదు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య విభేదాలు తెచ్చి విగడొట్టడమే ప్రధమ కర్తవ్యంగా బీజేపీ పావులు కదుపుతోందనే ప్రచారం పెరిగిపోతోంది. అలాగే విడగొట్టిన తర్వాత వీలైతే శివసేనను లేకపోతే పవార్ ను ఎన్డీయేలోకి లాక్కోవాలనే అజెండాతోనే మోడి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీళ్ళద్దరి తాజా భేటీ పర్యవసానాలు ఎలాగుంటాయ్ చూడాల్సిందే.