అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయితే జరగబోయేదేమిటో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఎలాగైనా బెయిల్ రద్దుచేయించి జగన్ను మళ్ళీ జైలుకు పంపేందుకు వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నారాయణ మీడియాతో మాట్లాడుతు రఘురామ తప్పు చేశారని అభిప్రాయపడ్డారు.
జగన్ బెయిల్ రద్దుచేయించి మళ్ళీ జైలుకు పంపాలన్న రఘురామ ప్రయత్నాన్ని తప్పుపట్టారు. ఎంపి ప్రయత్నాలు ఫలించి ఒకవేళ బెయిల్ రద్దయితే జగన్ కే లాభంకానీ ప్రతిపక్షాలకు కానీ లేదా రఘురామకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. గతంలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే అన్నారు. అప్పట్లో కూడా జగన్ను జైలుకు పంపినపుడు జరిగిన ఉపఎన్నికలన్నీ వైసీపీనే గెలిచిందని గుర్తుచేశారు.
పొరబాటున బెయిల్ రద్దయి మళ్ళీ జగన్ జైలుకు వెళితే ప్రతిపక్షాలకే నష్టమని జోస్యం చెప్పారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికలంటు జరిగితే వైసీపీనే లాభపడుతుందని స్పష్టంగా చెప్పారు. గతానుభవం చూసికూడా జగన్ బెయిల్ రద్దు కావాలని రఘురామ చేస్తున్న ప్రయత్నం అవివేకమే అని తేల్చేశారు. తెలంగణాలో మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేసి ఎలా పోరాడుతున్నారో రఘురామ కూడా అలాగే జగన్ పై పోరాటం చేయాలని సలహా ఇచ్చారు.
జగన్ను ఓడించాలంటే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయాలే కానీ కోర్టుల్లో కాదన్నారు. బెయిల్ రద్దు చేయిస్తే జగన్ కే లాభమన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అఖండ మెజారిటి రావటానికి 16 మాసాలు జగన్ను జైలులో పెట్టారన్న సానుభూతి కూడా ఉందన్న విషయం అందరు మరచిపోయినట్లుందన్నారు. ఇపుడు జైలుకు పంపినా మళ్ళీ అదే రిపీటవుతుంది తప్ప వేరే ఏమీ జరగదని నారాయణ స్పష్టంగా చెప్పారు. మొత్తానికి నారాయణ భవిష్యత్తును బాగానే స్టడీ చేసినట్లున్నారు.