రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం అంటే.. కేవలం పాలనకు మాత్రమే కేంద్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణంగా ఏ ముఖ్యమంత్రి కార్యాలయంలో అయినా.. జరిగేదే. పాలనకు సంబంధించిన కార్యక్రమాలకు, విధివిధానాల నిర్ణయాలకు సీఎంవో వేదికగా ఉండాలి. అయితే.. కొన్నాళ్లుగా ఏపీ సీఎం జగన్ కార్యాలయం మాత్రం రాజకీయాలకు వేదికగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు అధికారులు.. సలహాదారులు పైచేయిసాధించేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ రాజకీయ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని.. దూకుడు చూపిస్తున్నారని.. దీంతో ప్రభుత్వంపైనా..పాలనపైనా.. యాంటీ ఎట్మాస్ఫియర్ వచ్చిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికితోడు జగన్ చిన్నాన్న.. వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు కూడా ప్రత్యేకంగా వర్గాలు ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. అంటే.. సీఎంవోలో ఉండే అధికారులను ఆయా నేతలు తమవైపు తిప్పుకొవడం ద్వారా.. తమకు అనుకూలంగా జిల్లాల్లో ఆదేశాలు అమలయ్యేలా చూసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
మరీముఖ్యంగా సజ్జల దూకుడు ఎక్కువగా ఉందని.. వైవీ వర్గం.. లోపాయికారీగా.. మీడియా వర్గాలకు లీకులు ఇవ్వడం సంచలనంగా మారింది. నిజానికి సీఎం జగన్ కూడా ఈ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని.. సజ్జలదే అంతా పెత్తనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నా.. జగన్ పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోందని సీఎంవో వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. సీఎంవో స్థాయిని వీరంతా కలిసి దిగజార్చుతారా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు సీఎంవో కేంద్రంగా గత చంద్రబాబు హయాంలోనూ విమర్శలు వచ్చాయి. మంత్రిగా కాక ముందు.. నారా లోకేష్ సీఎంవో కేంద్రంగా దూకుడు చూపించారని..అప్పట్లో టీడీపీ వ్యతిరేక మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ రేంజ్‌ను కూడా దాటేసి.. పెద్ద ఎత్తున వర్గ పోరు చోటు చేసుకోవడం .. ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా ఉండడం గమనార్హం. మరి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.