రాజకీయాల్లో దూకుడు మంచిదే అయినా.. అది పార్టీకి, ఏకంగా నేతలకు కూడా ఇబ్బంది కలిగించేలా ఉంటే.. మాత్రం ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. ఇదే తరహాలో మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.
తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఒకప్పుడు గట్టి పట్టున్న యనమల ఫ్యామిలీ తర్వాత కాలంలో అంచెలంచెలుగా పట్టుకోల్పోతోంది. దీంతో ఒకప్పుడు వరుస విజయాలు దక్కించుకున్న యనమల కుటుంబం.. అనంతర పరిస్థితిలో వరుస పరాజయాలను చవిచూసింది. ముఖ్యంగా 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూశారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల తన సోదరుడు కృష్ణుడుకు అవకాశం ఇప్పించుకున్నారు.
అయితే.. ఆ రెండు ఎన్నికల్లోనూ పరాజయం పాలయ్యారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యనమల కృష్ణుడు చేసిన రాజకీయాలతో అక్కడ పార్టీని బ్రష్టు పట్టించేసింది. ప్రస్తుతం పుంజుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పైగా..వైసీపీ దూకుడు ఎక్కువగా ఉండడం.. టీడీపీని తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో స్వయంగా యనమల జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి తన కుటుంబానికే టికెట్ ఇప్పించుకుంటారని.. కాబట్టి మేం ఎందుకు పనిచేయాలనే ధోరణితో ఉన్న నేతలను బుజ్జగించాలని యనమల నిర్ణయించుకున్నారు. త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర లేదా.. పర్యటనలు పెట్టుకుని కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకునేలా యనమల దూకుడుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
అయితే.. వచ్చే ఎన్నికల నాటికి కృష్ణుడిని మార్చినా.. యనమల కుమార్తె పోటీకి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మహిళా సెంటిమెంటు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో యనమల ఎలాంటి నిర్ణయం తీసు కుంటారు ? అనేది ఆసక్తిగా ఉంది.
ఇక, ఈ నియోజకవర్గం విషయాన్ని చంద్రబాబు.. పూర్తిగా యనమలకే వదిలిపెట్టడంతో తమ్ముడిని పక్కన పెట్టి.. తనే స్వయంగా రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే వ్యూహంగా ముందుకు సాగాలని యనమల నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవంగా ఇప్పుడు తునిలో ఉన్న టాక్ ఏంటంటే 20 ఏళ్లుగా తునిలో అధికారానికి దూరంగా ఉన్న యనమల ఫ్యామిలీ మరో 20 ఏళ్లు కూడా అక్కడ గెలవదనే అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates