కొన్ని రోజులుగా ఈ విషయం రాజకీయ విశ్లేషకుల మధ్య ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. జనసేనపై కొన్నాళ్లుగా ఆసక్తి సన్నగిల్లినా.. ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన వారు కొన్ని జిల్లాల్లో విజయం దక్కించుకున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారు గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఫర్వాలేదు.. పార్టీ పుంజుకునేందు కు ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ, ఇటీవల జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలతో పార్టీపై ఆశలు, ఆసక్తులు పూర్తిగా సన్నగిల్లాయని అంటున్నారు పరిశీలకులు.
విస్మయ వ్యాఖ్యలు!
గెలుపు ఓటములు ఏ పార్టీకైనా కామన్. ఎంతో ప్రజాదరణ ఉందని అనుకుని లెక్కలు వేసుకున్న నాయకులు కూడా గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. వైసీపీ గాలి వీచిందని చెప్పుకొన్న కీలక నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతలు ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన ఏ పార్టీని తక్కువ అంచనా వేయలేం. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు సాగాలి. అయితే.. పార్టీని నిలబెట్టుకునే విషయంలో పవన్ ఒకింత ఆందోళనగా ఉన్నట్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీని నడపడం.. అంత ఈజీకాదని.. నిలబెట్టడం కూడా కష్టమేనని.. చెబుతున్నారు. దీంతో కార్యకర్తలు సహా.. అన్ని వర్గాల్లోనూ పవన్ వ్యవహారం విస్మయంగా ఉంది.
ఇదీ .. స్పష్టత!
నిజానికి రాష్ట్రంలో రాజకీయంగా రెండు ప్రధాన పార్టీలు(టీడీపీ, వైసీపీ) ఉన్నాయి. వీటిని కాదని.. ప్రత్యామ్నాయ పార్టీని వెతుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి జనసేన ఆశాదీపంగా కనిపించి ఉంటే.. పార్టీ పుంజుకోవడం పెద్ద సమస్యకాదు. కానీ, పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేనలో చేరాలని అనుకున్నవారు.. లేదా.. జనసేనకు అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే.. ఓడిపోయే పార్టీనైనా ప్రజలు విశ్వసిస్తారు కానీ.. నిలకడలేని.. తనపై తనకు నమ్మకం లేని పార్టీని ఎవరూ విశ్వసించరు. ఇదే పరిస్థితి జనసేన విషయం లో స్ఫష్టంగా కనిపిస్తోంది.
సాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్
పవన్ వ్యాఖ్యలతో కేడర్లో పెరుగుతున్న అసంతృప్తి.. ఆయా సామాజిక వర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకత వంటివి మొత్తానికి జనసేనను ఇబ్బందుల్లోకి నెడతాయని.. అంటున్నారు పరిశీలకులు. అంటే.. పవన్ తన వ్యాఖ్యలతో తన పార్టీని తనే ఇబ్బందు ల్లోకి నెట్టుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక, పవన్ వ్యతిరేక పార్టీ వైసీపీని పరిశీలిస్తే… జనసేన తనంతట తనే అంతమయ్యే పార్టీ అంటూ.. ఇటీవల విజయసాయిరెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. “కొన్ని కొన్ని పార్టీలను ఎవరూ అంతం చేయనక్కర్లేదు.. అవే కాలగర్భంలో కలిసిపోతాయి!” అంటూ సాయిరెడ్డి చేసిన ట్వీట్ జనసేన గురించే అనే కామెంట్లు వినిపించాయి.
వ్యూహమే లోపం!
ఎదిగేందుకు అవకాశం ఉండి.. భారీ సంఖ్యలో అబిమానులు ఉండి.. కూడా పవన్ రాజకీయంగా పుంజుకోలేక పోవడానికి వ్యూహమే లోపమని అంటున్నారు పరిశీలకులు. పైగా.. కొందరు నేతలు.. వ్యక్తిగత అజెండాతో పార్టీని పుంజుకోలేకుండా చేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు.. మరింత నిరాశావాదం దిశగా పార్టీని అడుగులు వేయించారని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో.. చూడాలి.