ఎప్పుడు జరుగుతుందో తెలీని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో కేసీయార్ లో టెన్షన్ బాగా పెరిగిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఉపఎన్నిక విషయంలో ఇన్చార్జి బాధ్యతలను తాజాగా మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఇంతకుముందే హూజూరాబాద్ టౌన్ బాధ్యత మరో మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. ఇక నియోజకవర్గంలోని వివిధ మండలాల బాధ్యతలను ఎంఎల్ఏలకు ఇతర ఛైర్మన్లు, సీనియర్ నేతలకు అప్పగించేసిన విషయం తెలిసిందే.
ఎవరి పనిని వాళ్ళు చేసుకుంటున్నా ఎందుకనో కేసీయార్లో ఎక్కడో అనుమానం ఉన్నట్లుంది. అందుకనే ప్రతిరోజు ఇటు హరీష్ తో పాటు అటు సీనియర్ నేతలతో కూడా కేసీయార్ టచ్ లో ఉన్నారట. నియజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ప్రతిరోజు పార్టీ నేతల నుండే కాకుండా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. నిజానికి రోజువారి నివేదికలు తెప్పించుకునేందుకు ఏమీ ఉండదు.
అయినా సరే ప్రతిరోజు తనకు రిపోర్టులు రావాల్సిందే అని గట్టిగా ఆదేశించారని సమాచారం. ఈటలతో పాటు పార్టీని వదిలి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి ఆకర్షించే బాధ్యతలను హరీష్ తో పాటు మరికొందరు నేతలకు అప్పగించారట. ఈటలతో సంవత్సరాల పాటు రాజకీయాలు చేస్తున్న నేతలతో మంత్రి, సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్నారట. వీరిలో కొందరిని మళ్ళీ పార్టీలోకి ఆకర్షించినట్లు సమాచారం.
ఇవన్నీ సరిపోదన్నట్లుగా నియోజకవర్గంలోని ప్రతి 50 ఇళ్ళకు పార్టీ తరపున ఒక ఇన్చార్జిని నియమించారట. ఇప్పటివరకు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ కేసీయార్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారట. వచ్చిన ప్రతిపాదనలను వచ్చినట్లుగా ఆమోదిస్తు పనులు మొదలుపెట్టేస్తున్నారట. మొత్తానికి నియోజకవర్గంలో జరుగుతున్నది చూస్తుంటే హుజూరాబాద్ ఉపఎన్నికంటే కేసీయార్ ఎంతగా టెన్షన్ పడిపోతున్నారో అర్ధమైపోతోంది.