జగన్ సర్కారుతో మళ్లీ పవన్‌కు పంచాయితీనే


కొన్ని నెలల కిందట ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజైనపుడు ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో టికెట్ల రేట్ల విషయమై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంచి అమ్మడం, అదనపు షోలు వేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే కానీ.. ఇంకే సినిమాకూ లేని విధంగా ఈ సినిమాకు మాత్రమే ఆ విషయంలో నియంత్రణ తీసుకొచ్చారు అధికారులు. థియేటర్ల మీద దాడులు చేసి దశాబ్దం కిందటి రేట్లతో టికెట్లు అమ్మించారు. మరీ ‘సి’ సెంటర్లలో 10, 20 రూపాయల రేట్లతో టికెట్లు అమ్ముకోవాల్సి రావడం థియేటర్ల యాజమాన్యాలకు తీవ్ర ఆవేదన కలిగించింది.

ఐతే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టే దీని విషయంలో అంత పట్టుదలగా వ్యవహరించారని.. తర్వాత ఈ నియంత్రణ ఉండదని అప్పుడే అంచనా వేశారు సినీ జనాలు. ఇప్పుడు అనుకున్న ప్రకారమే ప్రభుత్వం ఆలోచన మారింది. ఏపీలో టికెట్ల రేట్లకు సంబంధించి కొత్త జీవోను ఇచ్చింది జగన్ సర్కారు.

ఏపీలో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ జీవోను ఇచ్చారు. దీని ప్రకారం కొత్త సినిమాల టికెట్ల రేట్లు విషయమై ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ‘ఫిల్మ్ టు ఫిల్మ్’ బేసిస్ మీద రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని పేర్కొంది. అంటే ఒక సినిమా స్థాయిని బట్టి దాని నిర్మాత విజ్ఞప్తిని అనుసరించి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తారన్నమాట. తమ సినిమా పెద్ద స్థాయిదని, బడ్జెట్ ఎక్కువ అని, టికెట్ల రేట్లు పెంచకుంటే రికవరీ కష్టమని నిర్మాత ప్రభుత్వానికి విడుదల ముంగిట విన్నవించుకుంటే.. పరిశీలించి రేట్లు పెంచుకునే ఛాన్సిస్తారన్నమాట. అంటే ఏ నిర్మాతకు ఆ నిర్మాత ప్రభుత్వం దగ్గర లాబీయింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇండస్ట్రీ జనాల్ని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ఇలా జీవో ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజైనా తమ దయా దాక్షిణ్యాలను బట్టే టికెట్ల రేట్ల పెంపు ఉంటుందని చెప్పడానికి ఉద్దేశపూర్వకంగా ఇలా జీవో ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే పవన్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.