‘అమ్మ’ ఆస్తి ఇక.. తమిళనాడు ప్రభుత్వానిదే

వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వస్తాం.. పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకెళ్లమన్న భావన ప్రతిఒక్కరిలో కలిగేలా చేయటంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

తిరుగులేని నేతగా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం..అపోలో ఆసుపత్రిలో చేరటం తెలిసిందే. అర్థరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రికి వెళ్లిన ఆమె.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన తర్వాత మాత్రమే ఆమెను చూసే అవకాశం ప్రజలకు లభించింది.

అపోలో ఆసుపత్రిలో సుదీర్ఘకాలం సాగిన ఆమె ట్రీట్ మెంట్ మీద సందేహాలు.. ఆరోపణల గురించి తెలిసిందే. అమ్మకు అత్యంత ప్రాణపదమైన పోయెస్ గార్డెన్ ను మ్యూజియంగా మార్చాలని కొంతకాలం డిమాండ్లు వినిపించాయి.

తాజాగా.. ఆ భవనాన్ని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఆర్డినెన్స్ ను జారీ చేయటం ఆసక్తికరం మారింది. పోయెస్ గార్డెన్ ను సొంతం చేసుకోవటానికి చట్టపరమైన వారసుల మధ్య పరిష్కారం కుదరని నేపథ్యంలో.. దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్స్ జారీ అయ్యింది.

ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుకు తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోమిత్ ఓకే చెప్పేశారు. పోయెస్ గార్డెన్ నిర్వహణను సీఎం నేతృత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి.. సమాచారా శాఖ మంత్రి.. సమాచార శాఖ కార్యదర్శి ధర్మకర్తలుగా ట్రస్టును ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్డినెన్సు ను జారీ చేశారు.

జీవితంలో కష్టపడి సంపాదించిన దానితో కట్టుకున్న భవనం.. అయిన వారికి కాకుండా.. ప్రభుత్వ పరమవుతుందని.. ఇలా ఒక ఆర్డినెన్స్ జారీ అవుతుందని ‘అమ్మ’ ఏ రోజు అనుకొని ఉండరేమో?