ఏపీలో మళ్లీ పదవుల కోలాహలం పుంజుకుంది. వైసీపీ నేతలు తమకుపదవి కావాలంటే.. తమకు కావాలని.. పోటీ పడుతున్నారు. ఇప్పటికే పదవులు దక్కక ఎదురు చూస్తున్న సీనియర్లతోపాటు.. కొత్తవారు కూడా నామినేటెడ్ పదవుల కోసం తాడేపల్లి ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులతోపాటు.. టీటీడీ పాలకమండలి చైర్మన్, శ్రీశైలం దేవస్థానం బోర్డు సహా ఇతర పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు ఉంటుందా? అని ఎదురు చూస్తున్న వైసీపీ నేతలకు తీపికబురు అందింది.
తాజాగా సీఎం జగన్ నామినేటెడ్ పదవులపై సమీక్ష నిర్వహించనున్నారనే విషయం తెలిసే సరికి ఈ పదవులు ఆశిస్తున్నవారితోపాటు.. తమ వారికి పదవులు ఇప్పించుకునేందుకు కొందరు మంత్రులు కూడా తాడేపల్లిలోనే మకాం వేశారు. టీటీడీ విషయాన్ని పక్కన పెడితే.. శ్రీశైలం దేవస్థానం చైర్మన్ సహా .. ఇతర కార్పొరేషన్ పదవుల రేసులో ఇద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు కూడా ఉండడం ఆసక్తిగా మారింది. వీరిలో మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.. సతీమణి కూడా ఉన్నారు.
ఇప్పటికే ఈ ఇద్దరు మంత్రలు సీఎం జగన్ నుంచి హామీ పొందినట్టు సమాచారం. విజయనగరం కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ఝాన్సీ పోటీపడుతున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తన కుమార్తెను ఈ పీఠంపై కూర్చోబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీంతో మంత్రికి హామీ ఇచ్చినా.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వీరభద్రస్వామిని శాంతింపజేసేందుకు ఆయన కుమార్తె వైపు జగన్ మొగ్గు చూపుతారని తెలుస్తోంది. ఇక,శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవి కోసం.. శిల్పా సోదరుల్లో పెద్దవాడైన శిల్పా మోహన్‌రెడ్డి ఎదురు చూస్తున్నారు.
గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడికి అవకాశం ఇప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరగా.. జగన్ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబం నుంచి కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నామినేటెడ్ పదవుల వ్యవహారం వైసీపీలో కోలాహలంగా మారడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates