దేశాలను వణికించేస్తున్న డెల్టా వేరియంట్

మనదేశాన్ని వణికించేసిన డెల్టా వేరియంట్ ఇపుడు ప్రపంచంమీద పడింది. ప్రపంచంలోని సుమారు 85 దేశాలను డెల్టా వేరియంట్ వణికించేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్రిటన్, రష్యా, స్పెయిన్, కెనడా లాంటి అనేక దేశాల్లో రెండు టీకాలను వేసుకున్న జనాలకు కూడా డెల్టా వేరియంట్ సోకుతుండటం. టీకాలు వేసుకున్నాం కదా ఇక మనకేం కాదు అని ధైర్యంగా బయట తిరిగేస్తున్న జనాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంఇది.

అగ్రరాజ్యం అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 20 శాతం ఈ డెల్టా వేరియంటే కారణమని నిర్ధారణవుతోంది. గడచిన నెలరోజుల్లో బ్రిటన్లో నమోదైన 50 వేల కేసుల్లో 38 వేలు డెల్టీ వేరియంట్ కేసులే అంటే దాని తీవ్రత ఎలాగుందో అర్ధమైపోతోంది. రష్యాలో అయితే గురువారం ఒక్కరోజే డెల్టా వేరియంట్ కారణంగా 548 మంది చనిపోయారు.

ప్రపంచదేశాల్లో పెరుగుతున్న కేసుల తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్ఓ) కూడా డెల్టా వేరియంట్ గురించి అత్యవసరమైన ప్రకటనలు చేస్తోంది. కరోనా వైరస్ సమస్య తగ్గిపోయింది కదాని లేకపోతే రెండు టీకాలు వేసుకున్నాం కదానే నిర్లక్ష్యంతో ఉండవద్దని జనాలకు పదే పదే మొత్తుకుంటోంది. జనాల నిర్లక్ష్యమే కేసుల తీవ్రతకు ప్రధాన కారణంగా డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నారు.

విచిత్రమేమిటంటే ఒకవైపు జనాలు టీకాలు వేసుకుంటున్నా మరోవైపు వైరస్ సోకుతునే ఉండటం. టీకాలు వేసుకున్నా తగిన జాగ్రత్తలు వహించకపోతే ఉపయోగం ఉండదని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా వింటున్న జనాలు పెద్దగా కనబడటంలేదు. ఇలా లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను సడలించాయో లేదో వెంటనే జనాలంతా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అవసరమున్నా లేకపోయినా రోడ్లపైకి వచ్చేస్తున్న జనాల్లో అత్యధికులు చదువుకున్న వాళ్ళే కావటం నిజంగా దురదృష్టమే.