జగన్ ఆలోచనలకు హైకోర్టు నుంచి అడగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా మడ అడవులు ధ్వంసం చేయడంపై కొందరు మత్స్యకారులు హైకోర్టులో పిటిషను వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు వెంటనే మడ అడవుల ధ్వంసాన్ని ఆపేయాలని సూచించింది. నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే కౌంటరు దాఖలు చేయాలని ఆదేేశించింది.
కొద్ది రోజలుగా మడ అడవుల నరికివేతపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాకినాడ వద్ద సముద్ర తీరాన వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న మడ అడవులను చదును చేసి అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొంత భాగం చదును చేసింది. ఇది తీవ్ర వివాదాస్పదం అయ్యింది.
విశాఖ పట్నానికి యారాడ కొండలు రక్షణ కల్పించినట్టే కాకినాడకు మడ అడవులు సముద్రం నుంచి రక్షణ కల్పిస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు వాదిస్తున్నారు. పైగా ఇక్కడ కోరంగి బర్డ్ శాంక్చుయరీలో అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయని… మడ అడవులు ధ్వంసం చేస్తే పక్షులకు ముప్పు ఏర్పడుతుందని పలువురు ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. అనేక తుపాన్ల నుంచి కాకినాడను రక్షించిన మడ అడవులు లేకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదని స్థానికులు చెబుతున్నారు.
పేదలకు మరెక్కడైనా ఇళ్లు ఇవ్వండి… మడ అడవులను మాత్రం నరకొద్దు అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కొందరు మత్స్యకారులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. అంతవరకు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది.