జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ 48 గంట‌ల గ‌డువు..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస లేఖ‌లు రాస్తున్న వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా మ‌రో లేఖ సంధించారు. ఈ లేఖ‌లో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు, పార్టీ నేత‌ల‌కు ఆయ‌న 48 గంట‌ల గ‌డువు విధించారు. ఈ లోగా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. తానే సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్ప‌డు ఆర్ ఆర్ ఆర్ రాసిన లేఖ సీఎం జ‌గ‌న్‌కు మ‌రింత షాకిస్తోంది.

కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ వెబ్‌సైట్‌ నుంచి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పేరును తొల‌గించారు. ఈ ప‌రిణామం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర‌ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయింది. వెంట‌నే స్పందించిన ర‌ఘురామ తాజాగా ఇదే విష‌యంపై నిల‌దీస్తూ.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ సంధించారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు.

వైసీపీ తరఫున గెలిచిన తాను ఇప్ప‌టికీ వైసీపీ ఎంపీగానే కొన‌సాగుతున్నాన‌ని.. అలాంటిది వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును ఎందుకు తొలగించారని నిల‌దీశారు. పార్టీ నుంచి బహిష్కరించారా? అని సందేహం వ్యక్తం చేశారు. పొరపాటున తొలగించారా? లేక కావాలనే చేశారా? అని స్పష్టత కోరారు. కావాలని తొలగించి ఉంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు.

48 గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ దృష్టికి తీసుకెళ్తానని ర‌ఘురామ‌ స్పష్టం చేశారు. నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం ఈ లేఖపై వైసీపీ నాయ‌క‌త్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.