మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ రాజీనామా చేసేయడం, అది ఆమోదం పొందడం గంటల వ్యవధిలోనే జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉప ఎన్నికపై పడింది. బీజేపీలో చేరనున్న ఈటల ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మిగతా పార్టీల సంగతి ఏంటి? అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? ప్రతిపక్ష కాంగ్రెస్ పోటీ పెట్టేది ఎవరిని వంటి చర్చ జరుగుతున్న సమయంలో… మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సమావేశం అవడంతో కలకలం సృష్టించారు. అయితే, తాజాగా ఆయన మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు.
2018 ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డబ్బులు పంపించి తన ఓటమికి ప్రయత్నించాడని తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. దీనిపై కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈటల చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. 2018 ఎన్నికల్లో డబ్బులు పంపిస్తే ఇప్పుడు స్పందిస్తున్నావు… ఈ రెండున్నర ఏళ్లుగా ఎందుకు మాట్లాడలేదు? ఇన్నాళ్లు నిద్ర పోయావా? అని విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పంచాయతీ నీకు… కేసీఆర్కు నడుస్తోంది. అందులోకి నన్ను లాగితే ఊరుకోనని హెచ్చరించారు.
ఈటల ప్రస్ట్రెషన్ లో ఉన్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల నువ్వు ఒక్కటి మాట్లాడితే… నేను రెండు మాట్లాడతా అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీనామా చేస్తున్నపుడు అమర వీరుల స్థూపం వద్దకు వెళ్ళిన ఈటల ఇన్నాళ్లు ఎక్కడ పోయారని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు అమర వీరుల స్తూపం దగ్గరకు ఎందుకు పోలేదు? ఒక్క అమర వీరుల కుటుంబాన్ని కూడా ఎందుకు పరామర్శించలేదు? అని విరుచుకుపడ్డారు. తనను టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఎవరు అడగలేదని కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని, హుజురాబాద్ లో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ప్రకటించారు. అయితే, ఓవైపు టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతూ మరోవైపు కాంగ్రెస్ తోనే బరిలో ఉంటానని చెప్పడం ద్వారా ఆ పార్టీకి కౌశిక్ ఝలక్ ఇస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.