గ‌డ్డం గీయించుకోండి మోడీ సార్‌.. అంటూ.. 100 పంపిన టీ స్టాల్‌ వ్యాపారి

క‌రోనా నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై స‌ర్వత్రా విమ‌ర్శలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రూ దీనిపై బ‌హిరంగంగా మోడీకి షాక్ ఇచ్చింది లేదు. కానీ, తాజాగా మహారాష్ట్రలోని బారామతికి చెందిన టీ అమ్ముకునే వ్యక్తి.. ప్ర‌ధాని మోడీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. నేరుగా మోడీకే ఆయ‌న షాకింగ్ కామెంట్లు పోస్టు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎవ‌రీ చాయ్ వాలా..
ప్ర‌స్తుతం ప్ర‌ధాని కొన్ని నెల‌లుగా గెడ్డం పెంచుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా గెడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి వంద రూపాయలు పంపాడు టీస్టాల్ య‌జ‌మాని అనిల్ మోరే. బారామతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్నాడు అనిల్ మోరే. ప్ర‌స్తుతం క‌రోనాతో వ్యాపారం దెబ్బ‌తిన‌డంపై ప్రధానికి తన అసంతృప్తి గళాన్ని వినిపించాడు.

లేఖ‌లో ఏం రాశాడంటే..
‘పీఎం నరేంద్రమోడీ గడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయిండానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి. చివరి రెండు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపైనే ప్రధాని దృష్టి సారించాలి’ అని ఆ లేఖలో మోరే పేర్కొన్నాడు.

అంతేకాదు..
‘నాకు మన దేశ ప్రధాని అంటే ఎంతో గౌరవం, అభిమానం. నేను దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు రూ.100 పంపుతున్నాను. దానితో ఆయన గెడ్డం గీయించుకోవాలి. ఆయన ఈ దేశ అత్యున్నత నాయకుడు. ఆయన్ని అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మహమ్మారి కారణంగా రోజు రోజుకు ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయాలనుకుంటున్నా. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఈ మార్గం ఎంచుకున్నా’ అని మోరే తెలిపారు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.