సీఎం జగన్ విషయంలో ఆయన సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు చేసిన కామెంట్లు నిజమని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామ చెప్పినట్లు జగన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని విమర్శించారు. మూడో దశలో పిల్లలపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం ముఖ్యమంత్రి మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.
పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని.. ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో నారా లోకేష్.. రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ‘కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ – విద్యార్థుల పై పెరుగుతున్న ఒత్తిడి’.. అంశంపై మానసిక వైద్య నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ వర్చువల్ భేటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ పరీక్షలను రద్దు చేయాలని ముక్తకంఠంతో కోరుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కరోనా సమయంలో తమ పిల్లలకు పరీక్షల కన్నా ప్రాణాలే ఎక్కువని తల్లి దండ్రులు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తోందని ఒకరిద్దరు తల్లిదండ్రులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్‌పైనా ఆయన ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పిల్లలకు సరైన ఆన్లైన్ క్లాసులు కూడా జరగలేదని.. పేదలకు ఉపయోగపడే ఫైబర్ నెట్‌ను నాశనం చేశారని ఆరోపించారు. జగన్ నిర్ణయాలతో పిల్లల్లో మానసిక ఆందోళన ఎక్కువవుతోందన్నారు. ప్రారంభమైన ఇంటర్ ఆన్లైన్ తరగతులకు హాజరవ్వాలో.. లేక పదోతరగతి పరీక్షలకు సిద్ధమవ్వాలో.. అర్థంకాని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని లోకేశ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహించారు.