ఇటీవల కాలంలో పలు అంశాలపై లేఖలు రాస్తున్న ముఖ్యమంత్రి జగన్.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇప్పటి వరకు టీకాలు, కరోనా మందులపై ప్రధానికి లేఖ రాసిన జగన్.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అందరూ కలిసి రావాలంటూ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు సంధించారు. అయితే.. వీటికి రెస్పాన్స్ ఏమీ కనిపించలేదు. ఇదిలావుంటే.. తాజాగా మరోసారి సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడం.. ఆసక్తిగా మారింది. మొత్తం నాలుగు పేజీల లేఖలో జగన్.. ఏమన్నారంటే..
‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని జగన్ .. ప్రధానిని కొనియాడారు. 2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని సంకల్పం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ మేరకు.. “ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం” అని వివరించారు.
అంతేకాదు.. “ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి” అని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్, ప్రధాన మంత్రిని కోరారు. ఈ సంద ర్భంగా కేంద్రంలోని ప్రధాని పాలనను, కరోనా సమయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని కూడా జగన్.. ప్రశంసించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates