స్వదేశీ వ్యాక్సిన్ సత్తాను మనం ప్రపంచ దేశాలకు చూపించామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 21 నుండి దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 100శాతం వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని, ఇక నుండి రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అవసరం లేకుండా… కేంద్రమే పూర్తిగా పంపిణీ చేస్తుందని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో కేవలం 25శాతం వ్యాక్సిన్లు ప్రైవేటులో అందుబాటులో ఉంటాయని, మిగతావన్ని కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు ప్రధాని. దేశంలో మరో మూడు కంపెనీల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని… గతంలో విదేశాల్లో టీకాలు వచ్చినా ఇండియాకు వచ్చేందుకు ఏళ్లు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్ లోనూ ఆర్మీ, నేవీ సహ అనేక సంస్థలు నడుంబిగించి… ఆక్సిజన్ సరఫరా యుద్ధప్రాతిపదికన చేశామన్నారు.