మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కి, తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఆ పార్టీకి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. ఇటీవల ఆయన పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా పార్టీకే దూరమయ్యారు.
ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరప్ చేసిన నాటి నుంచే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీ నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. గురువారం ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన ఈటల రాజేందర్… పార్టీ సభ్యత్వానికి, హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 19 ఏళ్ల నుండి పార్టీలో ఉన్నానని, ఎన్ని ప్రలోభాలు ఎదురైనా పార్టీ కోసం, తెలంగాణ నుండి నిలబడ్డానన్నారు. పార్టీ పిలుపు మేరకు ప్రతిసారి రాజీనామా చేసి… గెలిచి వచ్చిన నాయకున్ని అని తెలిపారు.
మంత్రిగా తప్పించే ముందు కనీసం తన వివరణ కూడా తీసుకోలేదని… తెలంగాణ ప్రజలు ఆకలిని అయినా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోరని ఈటల వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని సైతం చివరి కోరిక ఏమిటి అని అడుగుతారని.. కానీ నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. నాలాంటి పరిస్థితే మంత్రి హరీష్ రావుకు కూడా వచ్చిందని, ఇప్పుడు ఆయన నాపై వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులకు ఆ ఆవేదన ఎంటో తెలుసన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates