యోగి పాల‌న‌కు జీరో మార్కులు.. బీజేపీ గెలుపు క‌ష్ట‌మేనా?

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇప్పుడు బీజేపీ నేత‌ల ఆశ‌లు.. ఊసులు అన్నీ కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావ‌డం, ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చే పార్టీ..కేంద్రంలో చ‌క్రం తిప్పుతుంద‌నే.. నానుడి ఉండ‌డం.. పైగా భారీ సంఖ్య‌లో పార్ల‌మెంటు స్థానాలున్న రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం ద్వారా .. ఆయా ఎంపీ స్థానాల‌పై ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం ఉండడంతో జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై పెద్ద ఎత్తున దృష్టి సారిస్తుంటాయి.

ఇక‌, ప్ర‌స్తుతం బీజేపీ ఇక్క‌డ అధికారంలో ఉంది. పైగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసే ప్ర‌భుత్వ‌మే ఇక్క‌డ ఉండ‌డం గ‌మ‌నార్హం. యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌స్తుతం సీఎంగా ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఏడాది ఇక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే యూపీ ఎన్నిక‌ల్లో అయినా.. త‌మ ప‌ట్టు నిలుపుకోవాల‌ని.. బీజేపీ స‌త్తా చాటాల‌ని ఆ పార్టీ పెద్ద‌లు, నేత‌లు పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే.. ఏడాది ముందుగానే యూపీలో బీజేపీకి అంచ‌నాలు త‌డ‌బ‌డుతున్నాయి. ఇక్క‌డ యోగి పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అనేక వైఫ‌ల్యాలు బీజేపీ పాల‌న చుట్టూ ముసురుకున్నాయ‌ని తాజాగా నిర్వ‌హించిన ఓ స‌ర్వే స్ప‌ష్టం చేసిన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌తంలో డ్ర‌గ్స్ పేరుతో .. చాలా మంది విచ‌క్ష‌ణా ర‌హితంగా ఎన్ కౌంట‌ర్లు చేసేందుకు యోగి అనుమ‌తించ‌డం పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. స‌రే.. ఎన్నిక‌ల‌కు ముందున్న రెండేళ్ల పాల‌నే కీల‌కం క‌నుక‌.. ఇప్పుడు ఈ రెండేళ్ల పాల‌న కూడా బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

కొవిడ్‌ నియంత్రణలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెల్లుబుకుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎస్పీ బ‌లం పుంజుకుంది. ఇక‌, క‌రోనా క‌ట్ట‌డి, పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎస్పీ, బీఎస్పీలు పుంజుకున్న ద‌రిమిలా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న బీజేపీ పెద్ద‌లు.. నష్ట నివారణకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్రానికి పంపారు. లఖ్‌నవూ వచ్చిన వీరు.. పార్టీ నేతలతో రెండ్రోజులపాటు విస్తృతంగా చర్చించారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలతో పాటు యోగి నాయకత్వం తీరుపై రగులుతున్న అసంతృప్తిని తెలుసుకున్నారు. దీంతో ఎన్నికల ముంగిట సీఎంను మార్చనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే.. సీఎం ను మార్చే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని బీజేపీ పెద్ద‌లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.